సూర్యలంక తీరంలో గల్లంతైన మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-10-07T08:43:54+05:30 IST

సూర్యలంక తీరంలో గల్లంతైన మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం

సూర్యలంక తీరంలో గల్లంతైన మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం

బాపట్ల/విజయవాడ, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో గల్లంతైన మరో ముగ్గురి మృతదేహాలు కూడా బుధవారం లభించాయి. విజయవాడ సింగ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మంగళవారం సూర్యలంక తీరానికి వచ్చిన సంగతి తెలిసిందే. స్నానానికి సముద్రంలో దిగి వారిలో ఆరుగురు గల్లంతవగా అదే రోజు ముగ్గురి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన ముగ్గురి మృతదేహాలను మెరైన్‌ సిబ్బంది బుధవారం గుర్తించారు. ఉదయం 6 గంటలకు పాండురంగాపురం పరిధిలోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ దగ్గర ప్రభుదాస్‌ మృతదేహాన్ని మెరైన్‌ సిబ్బంది కనుగొన్నారు. మధ్యాహ్ననికి వాడరేవు దగ్గర రాఘవ (17), అడవిపల్లెపాలెం తీరం సమీపంలో సర్వసిద్దు ఫణి (14) మృతదేహాలను గుర్తించి బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 24 గంటల గాలింపు తర్వాత లభ్యమైన తమ కుమారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు భోరున విలపించడం చూపరులను కలచి వేసింది.

Updated Date - 2022-10-07T08:43:54+05:30 IST