TDP Protest: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-08T18:20:21+05:30 IST

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TDP Protest: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

అమరావతి: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నేతలు(TDP Leaders) నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ(chennupati gandhi) పై హత్యాయత్నం జరిగితే, పోలీసులు కేసు నీరుగార్చుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన  చేపట్టారు. పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలు పట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ (TDP) ధర్నాకు దిగింది.


పోలీస్ స్టేషన్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీలను తగలపెట్టారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పటమట పోలీస్ స్టేషన్ వరకు నేతలు  కాలినడకన ర్యాలీగా నిరసన తెలిపారు. పదునైన మెటల్‌తో దాడి చేయటం వల్లే కంటికి గాయమైందని వైద్యులు నివేదిక ఇచ్చినా పోలీసులు నిందితుల్ని కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలను కాపాడేందుకు కేసును నీరుగారుస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. నిరసనలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు పాల్గొన్నారు. 


కాగా... నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు (YCP leaders) దాడి చేశారు. గత శనివారం సాయంత్రం పటమటలంకలోని గర్ల్స్‌హైస్కూల్‌ వద్ద చెన్నుపాటి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత కంటికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చెన్నుపాటి గాంధీపై దాడిని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. 

Updated Date - 2022-09-08T18:20:21+05:30 IST