జేఈఈలో తెలుగు తేజాలు
ABN , First Publish Date - 2022-08-09T09:39:14+05:30 IST
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

- దేశ వ్యాప్తంగా 24 మందికి 100 శాతం స్కోర్
- వీరిలో పది మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులే
- టాప్-10 జాబితాలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు
- 6, 7, 9 ర్యాంకులతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు
- ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 24మంది విద్యార్థులు 100 శాతం మార్కులు స్కోర్ చేయగా వీరిలో అత్యధికంగా ఏపీ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం పది మంది తెలుగు వారు ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి నలుగురు, యూపీ నుంచి ఇద్దరు టాప్‌లో నిలిచారు. టాప్-10 ర్యాంకుల్లో ముగ్గురు ఏపీ విద్యార్థులున్నారు. పెనికలపాటి రవికిశోర్ 6వ ర్యాంకు సాధించగా, మెండా హిమవంశీ 7, పల్లి జలజాక్షి 9వ ర్యాంకు దక్కించుకున్నారు. వీరితో పాటు పోలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్ వంద పర్సంటైల్ సాధించారు. జూన్‌లో జరిగిన తొలి సెషన్ ఫలితాలను ఇప్పటికే ప్రకటించగా, జూలైలో జరిగిన రెండో సెషన్ పరీక్షలతో కలిపి తుది ర్యాంకులను ఎన్టీఏ ఇప్పుడు వెలువరించింది. పరీక్షా పేపర్ల కఠినత్వం ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియలో మార్కులు ఇస్తారు.
ఈ క్రమంలో కొందరికి మా ర్కులు తగ్గినా ర్యాంకులు మెరుగ్గా ఉంటాయి. ఈ పరీక్ష రెండు సెషన్లకు మొత్తం 10.26 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 9.05 లక్షల మంది హాజరయ్యారు. రెండు సెషన్లకూ కలిపి హాజరైన వారు 4.04 లక్షల మంది వరకూ ఉంటారని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. దేశం వెలుపల ఉన్న 17 నగరాలు సహా 440 నగరాల్లోని 622 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారని చెప్పారు. విద్యార్థులు జేఈఈ వెబ్సైట్ నుంచి స్కోర్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాగా, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఐదుగురి ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో గతేడాది రికార్డు స్థాయిలో 44 మంది 100 పర్సంటైల్ సాధించగా ఈసారి వీరి సంఖ్య 24కు తగ్గింది. కొవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం పరీక్షల సెషన్లను రెండు నుంచి నాలుగుకు పెంచడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు 100 స్కోర్ సాధించారని అధికారులు చెబుతున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విద్యార్థులెవరూ ఈసారి 100 పర్సంటైల్ సాధించలేదు.జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావచ్చు. ఆగస్టు 28న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అవుతా
మాది గుంటూరు జిల్లా.. తండ్రి ఆదినారాయణ ప్రైవేటు ఉద్యోగం, తల్లి కె.మందకుమారి స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీ చైతన్య గోసాల క్యాంప్‌సలో చదివాను. ఈఏపీ సెట్లో 15వ ర్యాంకు సాధించా. జేఈఈలో ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ బొంబాయిలో సీఎ్‌ససీ బ్రాంచ్‌లో చేరాలనుకుంటున్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
- పి.రవికిశోర్ (6వ ర్యాంకు)
గూగుల్‌లో ఉద్యోగమే లక్ష్యం
మాది శ్రీకాకుళం జిల్లా.. తల్లి స్వరాజ్యలక్ష్మి, తండ్రి రవిశంకర్ ప్రభుత్వ టీచర్లు. ఈఏపీ సెట్లో 3వ ర్యాంకు వచ్చింది. జేఈఈలో ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 7వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించా. తల్లిదండ్రుల స్ఫూర్తితో కష్టపడి చదివా. ఐఐటీ బొంబాయి క్యాంప్‌సలో చదవాలనుకుంటున్నా. భవిష్యత్తులో గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం.
- మెండ హిమవంశీ (7వ ర్యాంకు), శ్రీకాకుళం
కలెక్టర్ కావాలని ఉంది
మాది అనంతపురం. నాన్న గోవిందరావు ప్రభుత్వ టీచర్. అమ్మ జయలక్ష్మి గృహిణి. గాయత్రినగర్ శ్రీచైతన్య క్యాంప్‌సలో ఇంటర్ పూర్తిచేశా. ఈఏపీ సెట్లో 30వ ర్యాంకు వచ్చింది. జేఈఈలో ఆల్ఇండియా జనరల్ కేటగిరీలో 9 ర్యాంకు సాధించా. కలెక్టర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
- పి.జలజాక్షి (9వ ర్యాంకు)