ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టుకు చెప్పండి
ABN , First Publish Date - 2022-12-16T01:53:48+05:30 IST
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నవయుగ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిన వ్యవహారంలో ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తెలియజేయాలంటూ ఆ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మచిలీపట్నం పోర్టు ఒప్పందంపై నవయుగకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నవయుగ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిన వ్యవహారంలో ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తెలియజేయాలంటూ ఆ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలుచేస్తూ నవయుగ తొలుత హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సెక్షన్ 7 కింద ఆర్బిట్రేషన్ అప్లికేషన్‌ను ఎందుకు దాఖలు చేయలేదని నవయుగ సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టే ఆర్బిట్రేటర్‌ను నియమించాలని నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరగా.. ఆర్బిట్రేషన్‌కు అంగీకరిస్తున్నట్లు హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది.