మూడేళ్ల విధ్వంసం!

ABN , First Publish Date - 2022-05-31T08:43:56+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విధ్వంసకర పాలనకు మూడేళ్లు పూర్తయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల పాలనపై 1,111 అంశాలతో తెలుగుదేశం రూపొందించిన చార్జిషీటును సోమవారం సాయంత్రం

మూడేళ్ల విధ్వంసం!

ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు

రివర్స్‌ టెండరింగ్‌తో అభివృద్ధి వెనక్కి

వీరబాదుడుతో ప్రజలపై పెనుభారం

గడపగడపలో ప్రజల తిరుగుబాటు

బస్సుయాత్ర చేపట్టినా ఛీత్కారమే

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న ధ్వజం

1,111 అంశాలతో ప్రజా చార్జిషీటు


విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విధ్వంసకర పాలనకు మూడేళ్లు పూర్తయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల  పాలనపై 1,111 అంశాలతో తెలుగుదేశం రూపొందించిన చార్జిషీటును సోమవారం సాయంత్రం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ పాలనకు శ్రీకారం చుట్టారని.. అరాచక పాలనకు తెరతీశారని మండిపడ్డారు. సొంత మీడియాలో పనిచేసే వారిని ప్రభుత్వ సలహాదారులు, పీఏలుగా తీసుకుని వారికి అత్యధికంగా జీతాలివ్వడమే కాకుండా తన పత్రికకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన రూపంతో దోచిపెడుతున్నారని విరుచుకుపడ్డారు. పారదర్శకత కోసంరివర్స్‌ టెండరింగ్‌ విఽధానం తెస్తానని గొప్పలు చెప్పి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. ‘టీడీపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రయత్నించలేదు సరికదా.. సర్వనాశనం చేశారు.


పోలవరం, రాజధాని అమరావతి పనులు రివర్స్‌లో ఉన్నాయి. విపక్ష నేతగా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ అన్నింటా బాదుడే బాదుడూ.. అంటూ దీర్ఘాలు తీసిన జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వీరబాదుడు బాదుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చెత్తపై పన్ను వేశారు. మూడేళ్ల పాలనపై గడప గడపకు వెళ్లిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులను జనం ఛీకొట్టి ఎక్కడికక్కడే నిలదీశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన విషయం గుర్తించిన వైసీపీ.. సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర ప్రారంభించింది. దానికి కూడా తిరస్కారమే ఎదురైంది. పది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చి పవర్‌ మాత్రం రెడ్లకు అప్పగించింది. మొత్తం 56 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. ఏపీలో బీసీలే లేనట్లు తెలంగాణకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటిచ్చారు. రైతుభరోసాతో జగన్‌ మోసం చేశారు. సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించిన వ్యక్తి చీప్‌ లిక్కర్‌తో మూడేళ్లుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇసుకను ప్రైవేటుకు అప్పగించారు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపేసిన వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి కోనసీమలో వివాదం సృష్టించారు. కులాల మధ్య చిచ్చు రేపడానికి జగన్‌ స్పాన్సర్‌షిప్‌ తీసుకున్నారు’ అని ఆరోపించారు.. స్పీకర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం మహానాడుపై చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు.  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ధీమా వ్యక్తంచేశారు.  


క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ మూడేళ్ల పాలనపై 1,111 అంశాలతో టీడీపీ ప్రజా చార్జిషీటు తయారుచేసింది. ‘క్విట్‌ జగన్‌..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరిట 78 పేజీలతో దీనిని రూపొందించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరాన్ని నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. అన్నింటా రివర్స్‌ పాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. నేరచరితులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. చార్జిషీటులోని ముఖ్యాంశాలు కొన్ని..


139 సంస్థలు అమరావతి నుంచి పరార్‌

జగన్‌ పాలన చూసి లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సిన 139 సంస్థలు అమరావతి నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. 175 నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సమకూర్చగల రూ.రెండు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేశారు. అమరావతి రైతులపై దుష్ప్రచారం చేశారు.  మూడు ముక్కలాటతో ప్రజా రాజధానిపై తప్పుడు ప్రచారం చేశారు. చివరకు రాజధాని ఏదని అడిగితే చెప్పుకోలేని దుస్థితి తెచ్చారు. ఈ దుస్థితిని తొలగిస్తూ హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ధిక్కరిస్తూ మంత్రులు, వైసీపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.


దాడులు.. కూల్చివేతలు

ఈ మూడేళ్లలో 226 దేవాలయాలు, విగ్రహాలపై దాడులు జరిగాయి. రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడికి యత్నిస్తే జగన్‌ సమర్థించారు. బహుమతిగా మంత్రి పదవి కట్టబెట్టారు. కియా పరిశ్రమపైనా దాడి చేశారు. ఫలితంగా 16 అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయాయి. జగన్‌రెడ్డి ఇంటికి పెద్ద రహదారుల కోసం వందలాది పేదల ఇళ్లు కూల్చేశారు. వేలాది నిర్మాణాలు కూలగొట్టారు. పండ్ల తోటలు నరికేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, న్యాయ వ్యవస్థలపై దాడులు చేశారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ జీవో 2430 తీసుకువచ్చారు. చివరకు సీబీఐపై కూడా దాడిచేశారు. తెలుగుదేశం ముఖ్య నాయకులపై దాడులు, కేసులు బనాయించారు. ఈఎ్‌సఐ కేసులో పేరు లేకపోయినా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఆయన కుటుంబంపై 107 బైండోవర్‌ కేసులు నమోదుచేశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.


వివేకా హత్య కేసు నిందితులకు మద్దతెందుకు? 

70 ఏళ్ల వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేసి గుండెపోటుగా చిత్రించి సొంత మీడియాలో తప్పుడు కథనం ప్రసారం చేశారు. ఈ హత్య కేసులో నిందితులకు తాడేపల్లి ప్యాలెస్‌ ఎందుకు మద్దతిస్తోంది? కరోనా సమయంలో మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ ప్రాణాలు తీశారు. నిందలు, అక్రమ కేసులతో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమయ్యారు. స్థానిక ఎన్నికల్లో 48 చోట్ల అభ్యర్థులను కిడ్నాప్‌ చేశారు. 118 చోట్ల అభ్యర్థుల ఆస్తులు ధ్వంసం చేశారు. ముగ్గురిని చంపేశారు. 322 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఎంపీ రఘురామరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.


ఏది సామాజిక న్యాయం?

4 కోట్ల మంది దళితులు, బహుజనులను లూటీ చేసి 17 మందికి మంత్రి పదవులివ్వడం సామాజిక న్యాయమా..? వందల మంది బీసీ, ఎస్సీ, మైనారిటీల ప్రాణాలు బలిగొని 17 మందికి పదవులివ్వడం సామాజిక న్యాయమా..? స్థానిక సంస్థల్లో బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కోతపెట్టి.. 16,800 రాజ్యాంగ పదవులను రద్దు చేసి.. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ మేరకు సామాజిక న్యాయం..? బీసీ సబ్‌ప్లాన్‌ నుంచి రూ.18,266 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నుంచి 6,320 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నుంచి రూ.878 కోట్లు, మైనారిటీల నిధుల నుంచి రూ.1,483 కోట్లు దారిమళ్లించడం సామాజిక న్యాయమా..? పది వీసీ పదవులను రెడ్లకు ఇచ్చేయడం సామాజిక న్యాయమా..? విదేశ విద్య, బెస్టు అవైల్‌బుల్‌ పాఠశాలలు, గురుకులాలు రద్దు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాల కుదింపు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలు, అన్న క్యాంటీన్ల రద్దు, చంద్రన్న బీమా కుదింపు.. ఏ సామాజిక న్యాయం..? 6 లక్షల మంది నిరుద్యోగులకు భృతి రద్దు, ఉపాధి కూలీలకు రేట్ల తగ్గింపు సామాజిక న్యాయమా..? 


ఏడు సార్లు కరెంటు చార్జీల పెంపు

విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏడుసార్లు పెంచేశారు. మద్య నిషేధం తెస్తానని చివరకు మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. ధరల పెంపుతో ప్రతి కుటుంబం నుంచి ఏడాదికి రూ.18 వేలు కొట్టేస్తున్నారు. మూడేళ్లలో 70 వేల కోట్ల పన్నుల భారం మోపారు. చంద్రబాబు పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకం ముద్రించి పంచిపెట్టారు. ఈ మూడేళ్లలో అది నిరూపించలేకపోయారు.


8 లక్షల కోట్ల అప్పు..

మూడేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షల చొప్పున భారం మోపారు. గవర్నర్‌ పేరిటా అప్పులు తెచ్చారు. జగన్‌రెడ్డి, ఆయన ముఠా ఇప్పటి వరకు రూ.1.75 లక్షల కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగుల కోసం రూ.3,800 కోట్లు దుబారా చేశారు. అనవసర ప్రకటనలు, సలహాదారుల జీతాలు, ఇతర ఖర్చుల కోసం రూ.1,000 కోట్లు తగలేశారు.

Updated Date - 2022-05-31T08:43:56+05:30 IST