ఎన్నికల వరకూ తీర్పు రానివ్వదు

ABN , First Publish Date - 2022-09-19T10:05:23+05:30 IST

రాజధానిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వరకు జడ్జిమెంట్‌ రాకుండా ఎత్తుగడలు వేస్తుందన్న అనుమానాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వెలిబుచ్చారు.

ఎన్నికల వరకూ తీర్పు రానివ్వదు

హియరింగ్‌కు సుప్రీంకోర్టు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల ఎత్తుగడలు వేస్తుంది

రాజధాని బిల్లు అసెంబ్లీలో మళ్లీ పెట్టకపోవచ్చు: పయ్యావుల


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాజధానిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వరకు జడ్జిమెంట్‌ రాకుండా ఎత్తుగడలు వేస్తుందన్న అనుమానాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వెలిబుచ్చారు. ‘‘కేసు పరిష్కారం కోసం సుప్రీంకోర్టు సమయాన్ని కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు తీసుకుంటుంది. ఎన్నికల లోపల జడ్జిమెంట్‌ రాకుండా ఎత్తుగడ వేస్తుంది. కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాలు, సీఎం జగన్‌ పట్ల అవగాహన ఉంది. జస్టిస్‌ లలిత్‌ గతంలో జగన్‌ కేసుల్లో ఆయన తరఫు లాయర్‌గా ఉన్నారు. రాజధాని విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. రాజధానిపై జస్టిస్‌ లలిత్‌ న్యాయం జరిగేలా చొరవ చూపుతారని ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. మళ్లీ శాసనసభలో అమరావతి రాజధాని బిల్లు బహుశా పెట్టకపోవచ్చు. వైసీపీ అసత్యాల పునాదులను బద్దలుకొట్టడానికి టీడీపీ సిద్ధంగా ఉంది’’ అని పయ్యావుల అన్నారు. ‘‘అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థమైనది. టీడీపీ ఎమ్మెల్యేలను బలవంతంగా గెంటేసి ప్రసంగించాల్సిన అవసరమేమొచ్చింది? అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు.


ఆ అసత్య ప్రచారాలనే మరింత విస్తృతంగా అన్ని వేదికలను ఉపయోగించుకొని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా తన ప్రభుత్వంమీద తానే తప్పుడు లెక్కలు చెప్పిన ఏకైక సీఎంగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారు. అంకెలు, సంఖ్యలు ఎవరూ చూడరన్న భావనతో  సభను తప్పుదోవ పట్టించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ శ్వేతపత్రం అడిగితే ఉలుకూ పలుకూ లేదు. ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో రెండురోజులు చర్చ పెడతామన్నా మాకు అభ్యంతరంలేదు’’ అని పయ్యావుల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దుస్థితి ఎందుకుందని నిలదీశారు. ముఖ్యమంత్రి ఒక రకంగా, మంత్రులు, అధికారులు మరో విధంగా చెపుతున్నారంటూ వివరించారు. అసత్యాలు మానుకుని శ్వేతపత్రం విడుదల చేయాలని కేశవులు డిమాండ్‌ చేశారు.


మీ భుజం మీరే తట్టుకుంటే కుదరదు

‘మీకు మీరే భుజం తట్టుకుంటున్నారు.. మీ కాళ్లకు మీరే దణ్ణం పెట్టుకుని, దీర్ఘాయుష్మాన్‌ భవ అనుకుంటే సాగదు’’ అ ని పయ్యావుల అన్నారు. సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నప్పడు వారిని చాంబర్‌కు పిలిచి స్పీకర్‌ మాట్లాడాలన్నారు. గతంలో స్పీకర్లు పాటించిన సంప్రదాయాలను తెలుసుకోవాలన్నారు. రూల్‌ పుస్తకాన్ని చదవాలని కోరారు. ‘పుల్‌ దెమ్‌ అవుట్‌’ అనడాన్ని తప్పు పట్టిన పయ్యావుల అదేమీ ఆయన సామ్రాజ్యం కాదన్నారు. ‘స్పీకర్‌ ఈజ్‌ ది సర్వెంట్‌ ఆఫ్‌ ద హౌస్‌’ అని, సభ్యులందరూ సమానమేనని రూల్‌బుక్‌లో రాసి ఉందన్నారు. కాని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలను పాలకుల్లా, టీడీపీ ఎమ్మెల్యేలను సేవకుల్లా చూస్తున్నారంటూ మండిపడ్డారు. సభలో రిఫరీగా ఉండాల్సిన స్పీకర్‌... మోర్‌ లాయల్‌ ద్యాన్‌ ద కింగ్‌ అనేలా ప్రభుత్వం కంటే ఎక్కువగా భుజానేసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సోమవారం సభలో చర్చ పెట్టాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. 

Read more