గుడివాడలో హాంకాంగ్ మాదిరి క్యాసినో: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-26T21:57:52+05:30 IST

గుడివాడలో హాంకాంగ్ దేశ స్టయిల్లో క్యాసినో జరిగిందంటున్నారని టీటీపీ

గుడివాడలో హాంకాంగ్ మాదిరి క్యాసినో: వర్ల రామయ్య

అమరావతి: గుడివాడలో హాంకాంగ్ దేశ స్టయిల్లో క్యాసినో జరిగిందంటున్నారని టీటీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మంత్రి కొడాలి నాని గుడివాడలో దుష్ట సంస్కృతికి స్వీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. క్యాసినోపై గత 10 రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఏమీ జరగనట్టు నటిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా నుంచి గుడివాడకు 13 మంది ఛీర్‌గర్ల్స్‌ను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయించారంటే విచారణ ఏదీ అని ఆయన ప్రశ్నించారు. బూతుల మంత్రి మాట్లాడే బూతులే కాకుండా తాము చెప్పే విషయాలు కూడా ముఖ్యమంత్రి కొంచెం వినాలని ఆయన హితవు పలికారు. కే-కన్వెన్షన్‌ జరిగే సంక్రాంతి సంబరాలకు హాజరవ్వాలని మంత్రి కొడాలి నాని, ఆయన తమ్ముడు చిన్ని పేరుతో కరపత్రాలు వేసిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కే-కన్వెన్షన్ బయట ఎడ్ల పోటీలు నిర్వహించింది నాని అయితే క్యాసినో నిర్వహించింది కూడా నానినే అని ఆయన పేర్కొన్నారు. కే-కన్వెన్షన్ దగ్గర లే-అవుట్‌లో జరిగిన మొత్తం జూద క్రీడలు కొడాలి నానే నిర్వహించారని ఆయన ఆరోపించారు. క్యాసినో కే-కన్వెన్షన్ బయట జరిగిందని చెప్పి తప్పించుకోవాలని పోలీసుల సహకారంతో  నాని  ప్రయత్నిస్తున్నారన్నారు.


నాలుగు నెలల నుంచి అక్కడ క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే పోలీసులకు సమాచారం లేదంటే ఎవరు నమ్ముతారన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా అని ఆయన నిలదీశారు. కొడాలి నానికి సంబంధం లేదని పోలీసులు చెప్పాలని చూస్తే భవిష్యత్తులో డిపార్ట్‌మెంటుకు చెడ్డపేరే మిగులుతుందని ఆయన హెచ్చరించారు. ఎస్సీ సిధ్దార్ద్ కౌశల్  చేతులను డీజీపీ కట్టేశారనుకుంటున్నారని ఆయన అన్నారు. క్యాసినో ముగిసిన తర్వాత ఆ పరికరాలను ఎక్కడ దాచారో పోలీసులు తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. Updated Date - 2022-01-26T21:57:52+05:30 IST