మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు: Achennaidu

ABN , First Publish Date - 2022-05-24T19:41:14+05:30 IST

టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు: Achennaidu

అమరావతి: టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...  మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారన్నారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వాహన యజమానుల్ని ఆర్టీవోలు బెదిరిస్తున్నారని తెలిపారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని భయపెడుతున్నారని చెప్పారు. అలా బెదిరించిన అధికారుల వివరాలు సేకరించామని... వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.


గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహానాడుకు శ్రేణులు సమాయత్తమవుతున్నారని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమల దండులా తెలుగుదేశం కార్యకర్తలు మహానాడుకు పోటెత్తుతారని స్పష్టం చేశారు. 3 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేక పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే మహానాడు విజయవంతం కాకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. స్టేడియం ఇస్తానని కలెక్టర్ చెప్తే అద్దె కూడా కట్టామని తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చాక స్టేడియం ఇవ్వమన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T19:41:14+05:30 IST