-
-
Home » Andhra Pradesh » Tariffs should be changed on an annual basis-NGTS-AndhraPradesh
-
వార్షిక పద్ధతిలోనే టారిఫ్‌లు మార్చాలి
ABN , First Publish Date - 2022-09-13T09:16:45+05:30 IST
విద్యుత్ పంపిణీ విషయంలో ఎప్పటికప్పుడు ట్రూ-అప్ చార్జీలను వినియోగదారులపై మోపకుండా, వార్షిక ప్రాతిపదికన మార్పుచేర్పులు ఉండాలని ఏపీ చాంబర్స్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

- వినియోగదారులపై ఎప్పటికప్పుడు భారాలు వేయొద్దు
- ముసాయిదాపై రాష్ట్రాలతో చర్చించాలి
- కేంద్ర విద్యుత్ మంత్రికి ఏపీ చాంబర్స్ వినతి
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ విషయంలో ఎప్పటికప్పుడు ట్రూ-అప్ చార్జీలను వినియోగదారులపై మోపకుండా, వార్షిక ప్రాతిపదికన మార్పుచేర్పులు ఉండాలని ఏపీ చాంబర్స్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్ సరఫరాను ప్రైవేటీకరించడం, వినియోదారుల ప్రయోజనాలకు హానికరమనే అభిప్రాయం ఉన్నందున విద్యుత్ ముసాయిదా చట్టం(సవరణలు) రూల్స్ 2022పై అన్ని రకాల విద్యుత్ వినియోగదారులతోపాటు వాటాదారులు, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అందరి మద్దతు కోరాలని పేర్కొంది. ఇది పాలసీని సజావుగా అమలు చేయడానికి దోహదపడుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌కు ఏపీ ఛాంబర్స్ సోమవారం పంపిన వినతిపత్రంలో పలు సూచనలు చేసింది. ‘‘కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ వల్ల సరఫరా రంగంలో పంపిణీ సంస్థల గుత్తాధిపత్యం తగ్గుతుంది. విద్యుత్ రంగంలో పోటీతత్వం కచ్చితంగా సేవల నాణ్యతను మెరుగుపరుస్తుంది. పోటీ ప్రభావం ధరలపై ఉంటుంది. ఎగుమతులను పెంచే విషయంలో ప్రపంచ పోటీని ఎదుర్కోవడానికి ఇది ప్రయోజనకరమే. అయితే 4జీ సీఈఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం డిస్కమ్‌లు సేవ, ధరలను అనుసరించడం లేదు. ఇటీవల ఇది టారిఫ్ అసాధారణ పెంపుదలకు దారితీసింది.
ఇలాంటి పరిస్థితుల్లో చట్ట సవరణ వల్ల సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగానే విద్యుత్ టారి్‌ఫలలో తరచూ మార్పులకు అవకాశం ఉంటుంది. వ్యాపార సంస్థలు ఉత్పత్తి వ్యయ ప్రణాళిక చేసుకోవాలంటే పరిశ్రమలకు విద్యుత్ నిరంతరాయ సరఫరా ఉండాలి. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ధర సర్దుబాటు చార్జీలను ఆటోమేటిక్‌గా లెక్కించి వినియోగదారులకు బిల్ చేయకూడదు. రాష్ట్ర కమిషన్ సూచించిన ఫార్ములా ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన రెగ్యులేటరీ అప్రూవల్ ప్రాసె్‌సను ట్రూ-అప్ చార్జీలుగా పరిగణించి మాత్రమే అమలు చేయాలి. వినియోగదారులకు సరసమైన ధరలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్(సవరణ) రూల్స్-2022 దోహదపడాలి. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం వినియోగదారుల ప్రయోజనాలకు హానికరం’’ అని ఏపీ చాంబర్స్ కేంద్రానికి సూచించింది.