ట్యాంకర్‌.. టెర్రర్‌

ABN , First Publish Date - 2022-08-31T08:53:59+05:30 IST

అసలే డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకరు. ఆపై పూటుగా మద్యం సేవించిన డ్రైవరు. రోడ్డుపై అడ్డదిడ్డంగా ట్యాంకర్‌ను నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మూడు నాలుగు వాహనాలు ఢీకొట్టాడు. ఆ ట్యాంకర్‌ను

ట్యాంకర్‌.. టెర్రర్‌

మద్యం సేవించి అడ్డదిడ్డంగా నడిపిన డ్రైవర్‌

పలువురికి త్రుటిలో తప్పిన ప్రమాదాలు

అడ్డంగా కట్టిన బారికేడ్లను ఢీకొని బోల్తా

తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

కాళ్లు చేతులు కట్టేసి తీసుకువచ్చిన పోలీసులు

లక్ష్మీపురం వద్ద బోల్తా పడిన డీజిల్‌ ట్యాంకర్‌

లారీ డ్రైవర్‌ను ఆటోలో వైద్యం కోసం తీసుకొస్తున్న దృశ్యం


జీలుగుమిల్లి, ఆగస్టు 30: అసలే డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకరు. ఆపై పూటుగా మద్యం సేవించిన డ్రైవరు. రోడ్డుపై అడ్డదిడ్డంగా ట్యాంకర్‌ను నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మూడు నాలుగు వాహనాలు ఢీకొట్టాడు. ఆ ట్యాంకర్‌ను ఆపేందుకు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు పెట్టారు. వాటిని ఢీకొట్టి ట్యాంకర్‌ బోల్తా పడింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్రైవర్‌ ప్రదీ్‌పకుమార్‌ కాకినాడ వైపు నుంచి హైదరాబాద్‌కు డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ తీసుకుని బయలుదేరాడు. అప్పటికే మద్యం సేవించి ఉండడంతో కొయ్యలగూడెం వచ్చే సరికి ఆర్టీసీ బస్సును రాసుకుంటూ వెళ్లాడు. ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


తర్వాత మూడు వాహనాలను ఢీకొట్టాడు. బాధితులు లారీని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. వేగవరం వద్ద ఇద్దరు యువకులు వెళుతున్న బైక్‌పైకి దూసుకొచ్చాడు. వారిద్దరూ బైక్‌పై నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాడువాయి వద్ద బారికేడ్లు అడ్డు పెట్టారు. వాటిని ఢీకొట్టి ట్యాంకర్‌ డ్రైవర్‌ వేగంగా వెళ్తుండగా.. లక్ష్మీపురంలో బోల్తా కొట్టింది. డ్రైవర్‌ కిందకు దూకేసి.. రోడ్డు కింద వంతెనలో దాక్కుని.. తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. సైౖకోలా ప్రవర్తించాడు. పోలీసులు అతడి కాళ్లు చేతులు కట్టేసి బయటకు తెచ్చారు. జీలుగుమిల్లి పీహెచ్‌సీలో డ్రైవర్‌కు చికిత్స చేయించి, ఆటోలో జంగారెడ్డిగూడెం తీసుకెళ్లారు. బోల్తాపడిన డీజిల్‌ ట్యాంకర్‌ వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదం జరక్కుండా జంగారెడ్డిగూడెం అగ్నిమాపక అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.



Updated Date - 2022-08-31T08:53:59+05:30 IST