నోటీసులు ఇచ్చాకే భూముల సర్వే
ABN , First Publish Date - 2022-12-16T00:18:15+05:30 IST
భూముల సర్వేలో ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదన్న రైతులు ఆందోళనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస వార్తలు సర్కారులో కదలిక తీసుకొచ్చాయి.
ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు
వీఆర్వో, గ్రామ కార్యదర్శికి నోటీసుల బాధ్యత
కలెక్టర్లకు రెవెన్యూశాఖ దిశానిర్దేశం
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి) : భూముల సర్వేలో ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదన్న రైతులు ఆందోళనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస వార్తలు సర్కారులో కదలిక తీసుకొచ్చాయి. భూములు కొలిచే ముందు రైతులకు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని చట్టం చెబుతున్న విషయాన్నే ప్రధానంగా ఉటంకిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ దిశగా ప్రతీ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో గ్రామ రెవెన్యూ కార్యదర్శి, గ్రామ కార్యదర్శి కూడా భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది. వీటిని ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదని, కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఇదే అంశంపై గురువారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటిపట్టాల పంపిణీ, చుక్కల భూములు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, మ్యుటేషన్, నాలా ఫీజుల వసూళ్లు తదితరాలపై చర్చించారు.
ఈనెల 8న జరిగిన సమావేశంలోనూ, తాజా భేటిలోనూ రీ సర్వే నోటీసులపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం-1923 ప్రకారం రాష్ట్రంలో భూముల సర్వే జరుగుతోంది. ప్రతీ గ్రామంలో రైతుల భూములు కొలవడానికి ముందు సెక్షన్ 9(1) నోటీసు ఇవ్వాలి. భూమిని కొలిచిన తర్వాత సెక్షన్ 9(2) నోటీసు ఇవ్వాలి. భూమిని సరిగ్గా కొలిచారా? లేదా కొలతల్లో తేడాలు ఉన్నాయా? గట్లు సరిగ్గానా వచ్చాయా? అభ్యంతరాలు ఉన్నాయా అని రైతులు 9(2) నోటీసుపై తెలపాలి. అయితే, గత కొంతకాలంగా రెవెన్యూ, సర్వే శాఖలు రైతులకు నేరుగా ఈ నోటీసులు ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమిని కొలవక ముందే 9(1), 9(2) నోటీసులు ఇచ్చి, అంతా బాగుందని సంతకాలు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెపట్టాయి. ‘ఆంధ్రజ్యోతి’ కూడా ఇదే అంశంపై వరుస వార్తలను ప్రచురించింది. రైతులను ఏమార్చి భూముల సర్వేచేస్తున్నారని పలు అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఆరాతీశారు. రైతుల విషయం కావడంతో చట్టపరమైన అంశాలను వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నోటీసులిచ్చి తీరాల్సిందే అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే భూముల సర్వే పూర్తయి, సర్వే, సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 13 నోటిఫికేషన్ ఇచ్చిన గ్రామాల పరిధిలోనూ సర్వే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లు రైతులు ఉపయోగించుకునేలా విస్త్రత ప్రచారం కల్పించాలని సీసీఎల్ఏ ఆదేశించారు. కలెక్టర్లు ఈ విషయంలో తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు.
అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారు..
చుక్కల భూములు, సాదాబైనామాల కేసుల పరిష్కారంపై సీసీఎల్ఏ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతుల పిటిషన్లను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్టోబరు 20 నుంచి డిసెంబరు 14 వరకు సాదాబైనామాలపై 9878 దరఖాస్తులు రాగా, అందులో రెండు మాత్రమే ఆమోదించడం పట్ల ఆయన మండిపడ్డారు. 33 దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారంటూ కారణాలపై ఆరాతీశారు. కొన్ని కేసుల్లో కారణాలు సహేతుకంగా లేవన్నారు. చుక్కల భూములకు సంబంధించి 58,688 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు 7వేల దరఖాస్తులు ఆమోదిస్తే, అందులో ఎంత మందికి హక్కులు కల్పించారని సీసీఎల్ఏ ఆరాతీసినట్లు తెలిసింది. భూ వినియోగమార్పిడి దరఖాస్తుల పరిష్కారం, నాలా కేసుల్లో ఫీజుల వసూళ్లు చాలా తక్కువగా ఉండటానికి కారణాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న నాలా ఫీజుల వసూళ్లకు తక్షణం చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ ఆదేశించారు.