Supreme Court: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2022-09-20T01:36:03+05:30 IST

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్‌సిగ్నలిచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ

Supreme Court: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ఢిల్లీ: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్‌సిగ్నలిచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ (Assembly) సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విభజన చట్టం రూల్స్‌ అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పర్యావరణ నిపుణులు ప్రొ. పురుషోత్తంరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణ (AP Telangana)ను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. విచారణ చేపట్టిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ రిట్ పిటిషన్‌ను జమ్ముకశ్మీర్ నియోజకవర్గా పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. 


కశ్మీర్‌లో సీట్ల పెంపునకు నోటిఫికేషన్‌ జారీ

మే నెలలో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపునకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఇక్కడ కూడా ఆ అంశంపై మళ్లీ కదలిక వచ్చింది. కశ్మీర్‌లో ప్రక్రియ పూర్తి కాగానే ఏపీ, తెలంగాణలో డిమాండ్‌ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చట్టబద్ధమైన హక్కును సాధించుకోవడానికి పార్టీలకతీతంగా పోరాటం సాగుగుతుందని చెబుతున్నారు. అయితే జమ్మూ కశ్మీర్‌ సీట్ల పెంపు సాకారమవుతుందా? దాని ఆధారంగా తెలంగాణలోనూ సీట్లను పెంచుకోవడానికి అవకాశముందా? అన్నది కొంత సందిగ్ధంగానే ఉందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.


370 ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్‌లోనూ భారత రాజ్యాంగమే అమలవుతోందని, ఈ దృష్ట్యా అక్కడ సీట్ల పెంపునకు కోర్టు అనుమతించకపోవచ్చని అంటున్నారు. అక్కడ సీట్లను పెంచితేనే.. ఇక్కడ సీట్ల పెంపు డిమాండ్‌కు బలం చేకూరుతుందని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన సందర్భంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్ల పెంపునకు భరోసా లభించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) చేపట్టాల్సి ఉంది. తెలంగాణలో 119 సీట్ల నుంచి 153 సీట్లకు, ఏపీలో 175 నుంచి 225 సీట్లకు పెంచాలని ఆ చట్టం చెబుతోంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం వద్ద ప్రస్తావిస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. 


ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత

ఏపీ (AP), తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్థానాల (Assembly seats) పెంపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. అసెంబ్లీ స్థాలన పెంపుపై రాజ్యసభ (Rajyasabha)లో బీజేపీ (BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని  కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ (Nityananda rai) తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153కి అసెంబ్లీ స్థానాలు పెంపు ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-20T01:36:03+05:30 IST