దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ఎలా సవాల్‌ చేస్తారు?

ABN , First Publish Date - 2022-10-11T09:14:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన షేక్‌ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని ఆమోదిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి సుప్రీంకోర్టు

దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ఎలా సవాల్‌ చేస్తారు?

సహనిందితులు అలా చేయకూడదు.. అది తప్పుడు సంప్రదాయం

ఫిర్యాదుదారు సునీతారెడ్డి సవాల్‌ చేస్తే పరిశీలిస్తాం.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి పిటిషన్లు కొట్టివేత


న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన షేక్‌ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని ఆమోదిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సహనిందితులు సవాల్‌ చేయడానికి వీల్లేదని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ-5), గజ్జెల ఉమాశంకర్‌రెడ్డి(ఏ-3)కి స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సవాల్‌ చేస్తే అప్పుడు పరిశీలిస్తామని తెలిపింది. వారిద్దరి పిటిషన్లనూ కొట్టివేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.


దానిపై ఈ ఇద్దరూ వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. విచారణలో భాగంగా కోర్టు ముందుకు వచ్చినవారు ఎవరని ప్రశ్నించింది. ఉమాశంకర్‌రెడ్డి ఈ హత్య కేసులో ఏ-3గా ఉన్నారని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది గురుకృష్ణకుమార్‌ తెలిపారు. ‘దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి మేజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించింది. హైకోర్టు దానిని సమర్థించింది. నిందితుడు అప్రూవర్‌గా మారడాన్ని కోర్టు ఆమోదించిన తర్వాత సహనిందితుడు దానిని ఎలా సవాల్‌  చేస్తాడు? ఒకవేళ దస్తగిరిని సాక్షిగా చేర్చితే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఎలాగూ జరుగుతుంది కదా! అసలు ఫిర్యాదుదారే ఎటువంటి ఫిర్యాదూ చేయడం లేదు. ప్రభుత్వం లేదా దర్యాప్తు సంస్థ నుంచీ ఫిర్యాదుల్లేవు’ అని గుర్తుచేసింది. సీనియర్‌ న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. ఈ కేసులో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘సహనిందితుడు సవాల్‌ చేయరాదని ఒకవేళ అనుకున్నా.. అదే సమయంలో ట్రయల్‌ కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేస్తే.. అవి సరైనవో కావో హైకోర్టు పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు 2013 చెప్పింది.


ఆ కోణంలో చూస్తే ఉమాశంకర్‌రెడ్డిని సమాచారం ఇచ్చిన వ్యక్తిగా పరిగణించాలి’ అని తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఉమాశంకర్‌రెడ్డి సమాచారం ఇచ్చిన వ్యక్తి కాదు.. నిందితుడు’ అని స్పష్టం చేసింది. ఆయుధాల కొనుగోలు వంటి తీవ్ర చర్యకు పాల్పడినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో అంగీకరించారని, ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా హత్య ఘటనలో క్రియాశీలంగా ఉన్నారని, అయినా కూడా దస్తగిరిని అరెస్టు చేయలేదని సీనియర్‌ న్యాయవాది తెలిపారు. పైగా ముందస్తు బెయుల్‌కు దరఖాస్తు చేసుకున్నారని, తాను నేరానికి పాల్పడలేదని దస్తగిరి ఆ దరఖాస్తులో పేర్కొన్నా సీబీఐ దానిని కోర్టులో వ్యతిరేకించలేదని, దాంతో ఆయనకు ముందస్తు బెయిల్‌ లభించిందని పేర్కొన్నారు. ‘ఈ హత్య కేసులో ఫిర్యాదుదారు సునీతారెడ్డి అప్రమత్తంగానే ఉన్నారు. ఆమె దాఖలు చేసిన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆమె సవాల్‌ చేస్తే అప్పుడు పరిశీలిస్తాం.


నిందితుడే ఇలాంటి ఉత్తర్వులను సవాల్‌ చేయడం వంటి తప్పుడు సంప్రదాయానికి తెరతీయొద్దు’ అని హితవు పలికింది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను కూడా జత చేయాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. తాను మెరిట్స్‌ ఆధారంగా వాదిస్తానని శివశంకర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ పేర్కొనగా.. ‘నిందితులు సవాల్‌ చేయొచ్చో లేదో తేల్చిన తర్వాత మెరిట్స్‌ ఆధారంగా వాదించండి’ అని ధర్మాసనం సూచించింది. నిజమైన నిందితుడిని కేసు నుంచి తప్పిస్తున్నారని సిబ్బల్‌ వ్యాఖ్యానించారు. ‘నిజమైన నిందితుడని.. నిందితుడే అనకూడదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిల పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Read more