‘పర్యావరణ’ పరిహారం చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2022-10-18T09:14:51+05:30 IST

పర్యావరణ ఉల్లంఘనల కేసులో సుప్రీం కోర్టులో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాలకు

‘పర్యావరణ’ పరిహారం చెల్లించాల్సిందే

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

పోలవరానికి ఎన్జీటీ విధించిన పరిహారంపై స్టే


న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ ఉల్లంఘనల కేసులో సుప్రీం కోర్టులో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ  సిఫారసు చేసిన పరిహారాన్ని వెంటనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.9 కోట్లు పరిహారం చెల్లించాలని సిఫారసు చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించాలి. పోలవరం ప్రాజెక్టుకు ఎన్జీటీ విధించిన పరిహారం జమ చేయడంపై న్యాయస్థానం స్టే విధించింది. గతేడాది డిసెంబరులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తేల్చిన ఎన్జీటీ పర్యావరణ పరిహారం కింద ఈ ప్రాజెక్టుకు రూ.120 కోట్లు, పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.24.9 కోట్లు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.


రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. సోమవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జేకే మహేశ్వరితో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాజెక్టుల వ్యయం ఆధారంగా ఎన్జీటీ విధించిన పరిహారం కాకుండా సంయుక్త కమిటీ చేసిన సిఫారసు ప్రకారం పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పులోని పరిహారం అంశం మినహా ఇతర అంశాలన్నింటినీ అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని, తదుపరి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ. 2.48 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.9 కోట్లు పరిహారం జమ చేయాలని సిఫారసు చేసిన ఎన్జీటీ సంయుక్త కమిటీ... పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి పరిహారాన్ని సిఫారసు చేయలేదు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసంఘ్వీ వాదనలు వినిపించారు. ఎన్జీటీ నియమించిన సంయుక్త కమిటీ నివేదికలో దాదాపు 90 శాతానికి పైగా అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని, ట్రైబ్యునల్‌ వాటిని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పరిహారాన్ని విధించడం సరికాదని, గతంలో ఒక కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. ప్రతివాదులు జమ్ముల చౌదరయ్య, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదించారు.

Read more