రాష్ట్రాదాయం గాడిన పడింది: సీఎం

ABN , First Publish Date - 2022-10-07T08:21:40+05:30 IST

రాష్ట్రాదాయం గాడిన పడింది: సీఎం

రాష్ట్రాదాయం గాడిన పడింది: సీఎం

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయం గాడిన పడిందని సీఎం జగన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే శాఖల ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆదాయ మార్గాల్లో 94.47 శాతం లక్ష్యాలను సాధించామన్నారు. దేశ జీఎస్టీ వసూళ్ల సగటుతో పోల్చితే రాష్ట్రంలో అధికంగా వసూళ్లు ఉన్నాయని వెల్లడించారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని సీఎం ప్రకటించారు. ఐఏఎస్‌ అధికారులు ఎంటీ కృష్ణబాబు, రజత్‌ భార్గవ, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, గుల్జార్‌ సభ్యులుగా ఉండే ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన సేవలు, వాటివల్ల దక్కే హక్కులు, అవి ఎలా ఉపయోగపడతాయన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. నాన్‌ రిజిస్ట్రేషన్‌ పరిస్థితులు ఇకపై ు. అస్తుల విలువ మదింపు, మిగిలిన రాష్ట్రాలకూ మన రాష్ట్రానికి మధ్య ఉన్న తేడా, హేతుబద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకోదగ్గ సేవల వివరాలను పోర్టల్‌లో వివరించాలని సూచించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ ఫిర్యాదు నంబరు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 19 శాతం అధికంగా రూ.1,400 కోట్లు వచ్చిందన్నారు. మైనింగ్‌ అనుమతులు, లీజు లైసెన్సు పొందినవారు కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి లీజుదారుల ఇబ్బందులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లీజుదారులు గనుల తవ్వకాలు చేపట్టకపోవడానికి గల కారణాలు గుర్తించి తక్షణమే పనులు ప్రారంభించేలా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. రవాణాశాఖలో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, కేవలం పన్నులు పెంచడమే కాకుండా వినూత్న ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల కొనుగోలులో సానుకూల ధోరణులు పరిశీలించి, రాష్ట్రంలోనూ అలాంటి వాతావరణం తీసుకురావాలన్నారు. బెల్టు షాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి నిరంతరం నివేదికలు తెప్పించుకొని, వాటి ఆధారంగా చర్యలు చేపట్టాలన్నారు. నాటుసారా తయారీ వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపాలని, అక్రమ మద్యం తయారీ, నిరోధంపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T08:21:40+05:30 IST