Rishikonda: ‘రిషికొండ’ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాధికారులా!
ABN , First Publish Date - 2022-12-15T03:55:08+05:30 IST
విశాఖలోని రిషికొండ అక్రమ తవ్వకాలపై వాస్తవాలు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వశాఖ(ఎంవోఈఎఫ్) ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ర్టానికి చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
వారికి కమిటీలో చోటు ఎలా కల్పిస్తారు?
ఎంవోఈఎఫ్ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం
పునఃపరిశీలన చేయాలని సూచన.. విచారణ 21కి వాయిదా
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖలోని రిషికొండ అక్రమ తవ్వకాలపై వాస్తవాలు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వశాఖ(ఎంవోఈఎఫ్) ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ర్టానికి చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అనుమతులకు మించి కొండను విచక్షణారహితంగా తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఈ విషయంలోనే అధికారుల పై కోర్టు ధిక్కరణ కేసులూ నమోదయ్యాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటు విషయంలో పునఃపరిశీలన చేయాలని ఎంవోఈఎ్‌ఫకు సూచించింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌కు విరుద్ధంగా విశాఖజిల్లా, చినగదిలి మండలం, ఎండాడ గ్రామంలోని సర్వేనెం.19లో రిషికొండను తవ్వేయడంతోపాటు చెట్లను తొలగిస్తున్నార ంటూ విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తవ్వకాలపై సర్వే నిర్వహించి, నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఎంవోఈఎ్‌ఫను కోర్టు ఆదేశించింది. బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలని ఎంవోఈఎ్‌ఫకు స్పష్టం చేసింది.
ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కమిటీ వేశామన్నారు. త్వరలోనే కమిటీ సర్వే నిర్వహించి నివేదిక సమర్పిస్తుందన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎ్‌సమూర్తి వాదనలు వినిపిస్తూ ఎంవోఈఎఫ్ వేసిన కమిటీలో ఏపీకి సంబంధించిన అధికారులు ముగ్గురు ఉన్నారన్నారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ, టౌన్-కంట్రీ ప్లానింగ్‌శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ అధికారులు, ఎంవోఈఎ్‌ఫకు చెందిన విజయవాడలోని ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ అధికారి కమిటీలో సభ్యులుగా ఉన్నారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కమిటీ ఏర్పాటులో పునఃపరిశీలన చేయాలని కేంద్రానికి సూచించింది.