అతివేగానికి ముగ్గురు బలి

ABN , First Publish Date - 2022-11-12T04:58:19+05:30 IST

కారు అతి వేగంగా పాలట్యాంకర్‌ను ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి సహా దంపతులు మృత్యువాతపడ్డారు. కారు నుజ్జునుజ్జవగా, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి.

అతివేగానికి ముగ్గురు బలి

ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

చిత్తూరు జిల్లాలో చిన్నారి సహా దంపతుల దుర్మరణం

తవణంపల్లె, నవంబరు 11: కారు అతి వేగంగా పాలట్యాంకర్‌ను ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి సహా దంపతులు మృత్యువాతపడ్డారు. కారు నుజ్జునుజ్జవగా, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కాణిపాకపట్నం వద్ద శుక్రవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలముప్పాళ్ల గ్రామానికి చెందిన అద్దంకి అశోక్‌ బాబు(33) ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. భార్య మౌనిక(29), కుమారుడు ప్రభవ్‌(3)తో కలిసి శుక్రవారం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. తవణంపల్లె మండలం కాణిపాకపట్నం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వీరి కారు వేగంగా వెనుక నుంచి ఢీ కొంది. ముగ్గురూ ఘటన స్థలంలోనే మరణించారు. పోలీసులు ఎక్స్‌కవేటర్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమిళనాడులోని కృష్ణగిరి నుంచి తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు డెయిరీకి వస్తున్న పాల ట్యాం కరును డ్రైవరు దేవ మూత్ర విసర్జన కోసం కాణిపాకపట్నం సమీపం లో రోడ్డు పక్కన ఆపా డు. ఇంతలో ట్యాంకరు వెనుక పెద్ద శబ్దం రావడంతో వచ్చి చూడగా, కారు ఛిద్రమై కనిపించింది. డ్రైవింగ్‌ చేస్తున్న అశోక్‌ బాబు నిద్ర పోయి ఉండడం, లేదా ముం దు సీట్లోనే కూర్చున్న మూడేళ్ల కుమారుడు పొరపాటుగా స్టీరింగ్‌ తిప్పేయడం వంటివి ప్రమాదానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-11-12T04:58:20+05:30 IST