స్పందనేదీ?

ABN , First Publish Date - 2022-08-09T09:50:01+05:30 IST

‘స్పందన’ ప్రతి సోమవారం ఠంచనుగా జరుగుతుంది. కానీ, సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటున్నాయి.

స్పందనేదీ?

  • దరఖాస్తుల్లో ఇంకుతున్న దుఃఖం
  • దివ్యాంగులు, వృద్ధులు, బిడ్డల తల్లులకు నరకం
  • ఫిర్యాదు అందిన 15 రోజుల్లో పరిష్కరించాలి
  • కానీ సంవత్సరాలుగా కాగితాలతో ప్రదక్షిణలు
  • అర్జీల్లో 70శాతం రేషన్‌ కార్డులు, పింఛన్ల పిటిషన్లే
  • ఏ పిటిషన్‌కూ ఉలకని, పలకని అధికారులు
  • ఆర్థికేతర పిటిషన్లకే ప్రాధాన్యంతో మొక్కుబడిగా కార్యక్రమం


గుంటూరు జిల్లాకు చెందిన మహిళా రైతు ఆదంషా 73 సెంట్ల భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది. ఆమె పొలం మీదుగా హైటెన్షన్‌ లైన్ల ఏర్పాటుతో బతుక్కి ఒక్కసారిగా షాక్‌ తగిలింది. తీగల కారణంగా సాగు ఆగిపోయింది. తన కష్టాన్ని సోమవారం స్పందనలో కలెక్టర్‌కు చెప్పుకొని ఆదంషా కన్నీటిపర్యంతమైంది.  

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘స్పందన’ ప్రతి సోమవారం ఠంచనుగా జరుగుతుంది. కానీ, సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటున్నాయి. సమస్యలపై ఇచ్చే అర్జీని 15 రోజుల్లో పరిష్కరించాల్సిన అధికారగణం..బాధితులకు నరకం చూపిస్తోంది. చివరకు కలెక్టర్‌ ఆదేశాలను క్షేత్రస్థాయిలో పాటించి సమస్యలను పరిష్కరించే కిందిస్థాయి అధికారులూ కరువయ్యారు. పూర్తి దివ్యాంగత్వం కంటికే కనిపిస్తున్నా ఆధారాలు కావాలంటూ తిప్పుతున్నారు. వంగిపోయి కళ్లలో ప్రాణం పెట్టుకుని ఒక చేత్తో కర్రపోటు వేస్తూ.. వణికే మరో చేత్తో పింఛను అర్జీ పట్టుకుని వచ్చే పండుటాకులకూ రోజంతా పడిగాపులే! ఏదో సాకుతో రేషన్‌కార్డు, పింఛను కట్‌ చేయడంతో జీవనరేఖ ఆగిపోయిన అభాగ్యులంతా కాగితాలతో కలెక్టరేట్ల వద్ద దర్శనమిస్తున్నారు.  ఉదాహరణకు సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌ ‘స్పందన’కు 220కిపైగా అర్జీలు వస్తే అందులో 70 శాతం రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇంటిస్థలాల మంజూరుకు సంబంధించిన పిటిషన్లే ఉన్నాయి. అయితే, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికే అధికారులు మొగ్గు చూపుతుండటంతో.. ఇలాంటి పిటిషన్లకు మోక్షమే దొరకడం లేదు. దీంతో సమస్యలు తీర్చలేని ‘స్పందన’ చాలా జిల్లాల్లో ఒక మొక్కుబడి కార్యక్రమంగానే మిగిలిపోతోంది. 


సొంత పార్టీవారే విసిగిపోయి.. 

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు అధికార పార్టీ ఎమ్మెల్యే కే రక్షణనిధి ప్రధాన అనుచరుడు కొంగల వినాయకరావు...తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి జగనన్న కాలనీలలో దొంగ పట్టాలను ఇచ్చి అక్రమ వసూళ్లకు తెగపడినట్టు వైసీపీ నేతలే ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడి నుంచి ఫోర్జరీ పొజిషన్‌ సర్టిఫికెట్లు తీసుకున్న బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ‘స్పందన’లో ఫిర్యాదు చేస్తున్నా పరిష్కారం చూపటం లేదని వైసీపీ నాయకుడు జీ నాగరాజు తన అర్జీలో వాపోయారు. గంపలగూడెం మండలం పెదకొమెర గ్రామం తో పాటు  శివారు తోటమాలలో రెండు లే అవుట్లు వేయగా, సర్వే నంబర్‌ 34/29లో తీవ్ర అవకతకవలు జరిగాయని కలెక్షర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. తాము కూడా అధికారపార్టీకి చెందిన కార్యకర్తలమేనని, పథకం ఉద్దేశం ఇలాంటి వారి వల్ల నీరుగారుతోందని వాపోయారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ‘స్పందన’లో ఫిర్యాదు చేస్తుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదన్నారు. జగనన్న కాలనీలకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్రమంగా లబ్ధిదారుల నుంచి వినాయకరావు డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల, డివిజన్‌ స్థాయుల్లో జరిగిన ‘స్పందన’లలో ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ‘సీఎంవో స్పందన’లో కూడా అర్జీ సమర్పించామని తన అర్జీలో నాగరాజు పేర్కొన్నారు.

  

విన్నపాలు వినవలె..

పొందూరు మండలం తాడివలస, బెలమాం పంచాయతీ సర్పంచ్‌లు, గ్రామ రైతులు సాగునీటి సమస్య పరిష్కారం కోసం పెద్దఎత్తున శ్రీకాకుళం కలెక్టర్‌ నిర్వహించిన స్పందనకు వచ్చారు.. ఇప్పటికే ఎన్నోసార్లు విన్నవించామని, ఈసారైనా దృష్టి సారించాలని అధికారులను అభ్యర్థించారు. 


సీఎం జిల్లాలోనే దిక్కు లేదు.. 

సీఎం సొంత జిల్లా కడపలో పేదలు, మధ్యతరగతిని బెదిరించి కొందరు అధికార పార్టీ నేతలు సాగించే భూకబ్జాలు, నివాస స్థలాల ఆక్రమణలు హద్దు దాటుతున్నాయి. బాధితులు కలెక్టరేట్‌, ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు ఇచ్చినా న్యాయం జరగడం లేదు. మళ్లీ మళ్లీ సమస్యల పరిష్కారం కోసం కడపకు వస్తున్నారు. మైదుకూరుకు చెందిన ఖాజాహుస్సేన్‌, సుబ్బరత్నమ్మ, జవహార్‌తాజ్‌కు 703/1బిలో 15 సెంట్ల స్థలం ఉంది. అయితే కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే చేసి హద్దులు చూపించాలంటూ జూలై 11న కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు. ఆ అర్జీని పట్టించుకోని అధికారులు.. సమస్య మాత్రం పరిష్కారం అయ్యిందంటూ జూలై 27న మెసేజ్‌ పంపారు. దీంతో అవాక్కయిన బాధితులు సోమవారం మరోసారి కలెక్టర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. 


కలెక్టర్‌ కన్నెర్ర

ఏలూరులో సోమవారం జరిగిన ‘స్పందన’కు రావాల్సిన సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి... తనకు బదులు కింది స్థాయి అధికారిని పంపించారు. దీనిపై కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. ‘మేమంతా పని లేక వచ్చామా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందనకు ఆయన రావాల్సిందేనని ఆదేశించడంతో సుమారు 12 గంటల సమయంలో సదరు అధికారి వచ్చారు. 


నెలనెలా తిప్పలే...

విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’కు రేషన్‌ కార్డు, పింఛన్‌ వంటి వాటిపై ఎక్కువ అర్జీలు వస్తుంటాయి. చినగదిలి ప్రాంతానికి చెందిన దివ్య, భవానీ అనే దివ్యాంగ యువతులకు పదకొండు సంవత్సరాలపాటు దివ్యాంగ పింఛన్‌ ఠంచనుగా అందింది. అయితే మూడేళ్ల నుంచి ప్రతి నెలా పింఛన్‌ కోసం ఇబ్బంది పెడుతున్నారు. పింఛన్‌ ఆగిపోయిన ప్రతిసారీ అధికారులను కలిస్తే ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ అదే తంతు. వీరికి గత నెల మరోసారి పింఛన్‌ ఆపేశారు. కార్డులో అమ్మ, ఇద్దరి (అక్కాచెల్లెళ్లు) పేర్లు ఉన్నాయి. కానీ కారు ఉన్నట్టు చూపుతూ సచివాలయ సిబ్బంది పింఛన్‌ ఆపేశారట! 


ఇంక రానే రాను..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన గోపాల్‌ దివ్యాంగుడు. కాళ్లు, చేతులు పనిచేయవు. మూడు చక్రాల బండి కోసం ‘స్పందన’లో అర్జీ పెట్టి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సోమవారం కూడా ట్రై సైకిల్‌ ఇవ్వాలని కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నాడు. ఈసారి న్యాయం జరగకపోతే ఇకపై స్పందనకు రానే రానని, తన తిప్పలు నేనే పడతానంటూ గోపాల్‌ అక్కడినుంచి బయటకు వచ్చాడు. 


తల్లి’డిల్లిపోతూ..

ఒంగోలుకు చెందిన భానుశ్రీ సోమవారం ‘స్పందన’కు తన కుమార్తెను ఎత్తుకుని వచ్చారు. ఆ అమ్మాయికి పుట్టుకతోనే కాళ్లు సరిగా లేవు. ఒక్కతి లేచి నిలబడలేదు. కనీసం బతుకుదెరువు కోసం పింఛన్‌ ఇప్పించాలని అధికారుల చుట్టూ భానుశ్రీ తిరుగుతున్నారు. కుమార్తె దివ్యాంగత్వాన్ని నిర్ధారించే సదరమ్‌ సర్టిఫికెట్‌ పట్టుకుని మూడేళ్లుగా ఎక్కని గడప, దిగని గడ ప లేవు. సోమవారం మళ్లీ కలెక్టర్‌ను కలిసి తనగోడు వెళ్లగోసుకున్నారు. 


ఉద్యోగమా.. ఎవరిస్తారమ్మా?

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామానికి చెందిన బసనబోయిన దుర్గ(35) దివ్యాంగురాలు. బీసీ వర్గానికి చెందిన ఈమె పలివెల వీరేశ్‌ అనే ఎస్సీ యువకుడిని పెళ్లి చేసుకున్నారు. నడవడానికి వీలులేని స్థితిలోనే ఎంఏ ఎకనామిక్స్‌లో పట్టభద్రురాలు అయ్యారు. తన విద్యార్హతకు తగిన ఉద్యోగం ఇప్పించాలని 15 ఏళ్లుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. నెల రోజుల క్రితం వచ్చి కలెక్టర్‌ కె.మాధవీలతను వేడుకోగా, ఆమె వికాస్‌ సంస్థ ప్రతినిధులను పిలిపించారు. దుర్గకు ఏదొక ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. సరే అన్న వికాస్‌ సంస్థ తర్వాత పట్టించుకోలేదు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు మరోసారి దుర్గ రాగా, ఆమెను కలెక్టర్‌ గుర్తించారు. మరోసారి వికాస్‌ ప్రతినిధిని పిలిచి, ఇంతవరకూ ఏమీ చూడలేదా... ఇప్పటికైనా చూసి ఇవ్వండని చెప్పడంతో సరే మేడమ్‌ అని ఒప్పుకొన్నాడు. కానీ పక్కకు వచ్చేసరికి స్వరం మారిపోయింది. ‘‘దివ్యాంగులకు ఏ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడం లేదు. నేనేమి చేయగలను’’ అని అతడు చెప్పడంతో దుర్గ బిక్కముఖం వేసింది. ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌లో 18 ఏళ్ల క్రితం పేరు నమోదు చేసుకున్నానని, 15 ఏళ్ల నుంచి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నానని ‘ఆంధ్రజ్యోతి’ వద్ద దుర్గ వాపోయారు. కులాంతర వివాహం చేసుకున్నా ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహమూ లేదని, తన భర్త కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆమె తెలిపారు. చిన్నఉద్యోగం ఇచ్చినా చేసుకుంటానని కనిపించిన అధికారినల్లా ఆమె ప్రాధేయపడుతున్నారు. 


పాపం చిన్నారి.. 

కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు రెడ్డివారిపల్లెకు చెందిన నంద్యం జ్యోతిరామ్‌ ఆదిత్య అనే 8 సంవత్సరాల బాలుడు వికలాంగ పెన్షన్‌ కోసం వచ్చాడు. ఉమ్మడి కడప జిల్లాగా ఉన్నప్పటినుంచీ ఈ కార్యక్రమానికి ఆదిత్య వస్తూనే ఉన్నాడు. ఇతడికి 89 శాతం వికలత్వం ఉన్నట్లు అధికారులు సైతం ధ్రువీకరించారు. సచివాలయంలో పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీలోలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం ఉండటం లేదని ఆదిత్య చెబుతున్నారు. కాగా, ఎక్కువగా భూవివాదాల విషయమై ప్రజలు  జిల్లా కలెక్టరేట్‌లో జరిగే స్పందనకు వస్తున్నారు. 

Updated Date - 2022-08-09T09:50:01+05:30 IST