2 నెలల క్రితమే రోడ్‌ మ్యాప్‌

ABN , First Publish Date - 2022-03-16T08:53:48+05:30 IST

తమ నేత అమిత్‌షా తిరుపతిలో రెండు నెలల క్రితమే రాష్ట్రంలో ఎలా పనిచేయాలో రోడ్‌ మ్యాప్‌ ఇచ్చారని, ఆ మేరకు జనసేనతో కలిసి పనిచేస్తున్నామని బీజేపీ

2 నెలల క్రితమే రోడ్‌ మ్యాప్‌

అమిత్‌షా తిరుపతిలో ఇచ్చారు

2024లో జనసేనతో కలిసి పనిచేస్తాం: సోము వీర్రాజు వెల్లడి


విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తమ నేత అమిత్‌షా తిరుపతిలో రెండు నెలల క్రితమే రాష్ట్రంలో ఎలా పనిచేయాలో రోడ్‌ మ్యాప్‌ ఇచ్చారని, ఆ మేరకు జనసేనతో కలిసి పనిచేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం విశాఖ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు. బీజేపీని రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి శక్తి కేంద్రాలను ఏర్పాటుచేశామని.. వాటి ద్వారా పోలింగ్‌ బూత్‌ల వరకు పని జరుగుతుందన్నారు. బీజేపీలో ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉందని.. దానిని పీకే (ప్రశాంత్‌ కిశోర్‌) కాపీ కొట్టి వైసీపీ ప్రభుత్వం ద్వారా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్రం ఆంధ్రకు మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా నిధులిస్తోందని, వాటిని జగన్‌ ప్రభుత్వం సద్వినియోగం చేయడం లేదని ఆరోపించారు.  కాగా.. జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ సోమవారం చేసిన రాజకీయ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు ఎన్ని సార్లు కోరినా.. వీర్రాజు ఒకే సమాధానం చెప్పారు. అది కూడా కాగితంపై రాసుకొచ్చిన దానినే పదే పదే చదివి వినిపించారు.

Read more