అప్పుడు జోలపాట.. ఇప్పుడు గర్జనా: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-10-17T10:03:40+05:30 IST
అప్పుడు జోలపాట.. ఇప్పుడు గర్జనా: సోమిరెడ్డి
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు అమరావతికి జోల పాట పాడి, ఇప్పుడేమో విశాఖ వెళ్లి గర్జిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘మంత్రి రోజా, ఎంపీ మిధున్‌రెడ్డి వైజాగ్ వెళ్లి గర్జించి వచ్చారు. వారంటే విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. వారికి ఓట్లు వేసిన ప్రజలు మాత్రం విశాఖ వెళ్లి గర్జించాలంటే 14 గంటలు బస్సుల్లో తిప్పలు పడాలా?’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో విశాఖలో పవన్ వద్దకు వచ్చిన అభిమానుల ఫోటోని ట్యాగ్ చేసి.. ‘‘ఇది పవన్ కల్యాణ్‌పై మోజు ఒక్కటే కాదు.. విశాఖ భూములు బొక్కుతున్న పందికొక్కుల మీద జనం తిరుగుబాటు’’ అని పేర్కొన్నారు.