దక్షిణ మధ్య రైల్వేకు ఆరు అవార్డులు
ABN , First Publish Date - 2022-12-15T03:40:18+05:30 IST
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సొంతం చేసుకుంది.
రాజమండ్రి, తెనాలి రైల్వేస్టేషన్లకు ప్రతిభ సర్టిఫికెట్లు
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సొంతం చేసుకుంది. ఇంధన పరిరక్షణ అంశంలో 2022 సంవత్సరానికి గానూ దక్షిణ మధ్య రైల్వేలోని కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రథమ బహుమతి అందుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ రైల్వేస్టేషన్ రెండో స్థానం దక్కించుకుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆరు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకున్నారు. కాగా, ఏపీలోని రాజమండ్రి, తెనాలి రైల్వే స్టేషన్లకు ప్రతిభ సర్టిఫికెట్లు దక్కాయి. ప్రభుత్వ భవనాల విభాగంలో గుంతకల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లకూ ప్రతిభ సర్టిఫికెట్లు దక్కాయి. ఇంధన పొదుపులో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.