తెలుగు సినీ సాహిత్యానికి ‘సిరి’వెన్నెల

ABN , First Publish Date - 2022-12-12T02:00:25+05:30 IST

తెలుగు సాహిత్యానికి సరైన గుర్తింపు తెచ్చిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

తెలుగు సినీ సాహిత్యానికి ‘సిరి’వెన్నెల

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటల సంపుటాలు ఆవిష్కరణ

మద్దిలపాలెం (విశాఖ సిటీ), డిసెంబరు 11: తెలుగు సాహిత్యానికి సరైన గుర్తింపు తెచ్చిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఏయూ వైవీఎస్‌ ఆడిటోరియంలో ఆదివారం తానా నిర్వహించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటల రెండు, మూడు సంపుటాల ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. సినిమా పాటల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందన్నారు. సమాజాన్ని మార్చే విధంగా పాటలు ఉండాలని అభిప్రాయపడ్డారు. విశాఖకు వస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని జస్టిస్‌ రమణ అన్నారు. గురజాడ, శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటివారు తన జీవితంలో ఉత్సాహాన్ని నింపారన్నారు. వ్యక్తిగతంగా శ్రీశ్రీ, రావిశాస్త్రి తెలుసునన్నారు. సీతారామశాస్ర్తి సినీరంగంలో తెలుగు భాష, సాహిత్యానికి మరింత గుర్తింపు తెచ్చారని కొనియాడారు. సీతారామశాస్ర్తి తండ్రి 14 భాషల్లో పండితుడని, తెలుగుభాషా సాహిత్యాన్ని ప్రపంచపుటల్లో నిలబెట్టిన ఘనత వారిదని అన్నారు. చివరిసారిగా సీతారామశాస్ర్తిని అవనిగడ్డలో కలిశానని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల పాటలను గ్రంథ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చిన తానా కృషి అభినందనీయమన్నారు. సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్ర్తి మాట్లాడుతూ.. తాను సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రేమ, వాత్స్యల్యం పొందానన్నారు. తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల రాసిన పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. అనంతరం సిరివెన్నెల పాటలతో కూడిన రెండు, మూడు సంపుటిలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, సిరివెన్నెల సోదరుడు సీఏ శాస్ర్తి, ప్రముఖ సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం, సినీ గేయ రచయితలు రామజోగయ్యశాస్ర్తి, బుర్రా సాయిమాధవ్‌, శుభోదయం సంస్థ అధినేత లక్ష్మీప్రసాద్‌, శ్రీనివాసరావు, ఎంవీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T02:00:25+05:30 IST

Read more