సెక్స్ వర్కర్లు ఏపీలోనే ఎక్కువ
ABN , First Publish Date - 2022-12-21T03:24:57+05:30 IST
పడుపువృత్తి చేసుకుంటూ స్థానికంగా జీవించే సెక్సు కార్మికులు (నెటీవ్ సెక్స్ వర్క్‌ర్లు) అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.
‘స్థానిక’ కేటగిరీలో అక్కడే అత్యధికం
1.33 లక్షలమంది ఉన్నారన్న కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 20: పడుపువృత్తి చేసుకుంటూ స్థానికంగా జీవించే సెక్సు కార్మికులు (నెటీవ్ సెక్స్ వర్క్‌ర్లు) అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. అటు స్థానిక సెక్సు కార్మికులను, ఇటు వలస సెక్సు కార్మికులను కలిపి లెక్కిస్తే దేశంలోనే ఏపీ అత్యంత ఘోరమైన, అధ్వాన పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని పలు ఎన్జీవో సంస్థలు తేల్చిచెబుతున్నాయి. హెచ్‌ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికను తయారుచేసింది. ఈ నివేదిక ప్రకారం, స్థానిక సెక్సు కార్మికులు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షలమంది ఉన్నారు. కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్షమంది ఈ పని ద్వారా పొట్ట పోసుకుంటున్నారు. ఇక.. మహారాష్ట్ర నుంచి వెళ్లి 6.6 లక్షల వలస సెక్సు కార్మికులు దేశవ్యాప్తంగా జీవిస్తుంటే.. తర్వాతి వరుసలో గుజరాత్ (2.3 లక్షలు), ఢిల్లీ (2.3 లక్షలు) నిలిచాయి.
సెక్సు కార్మికులు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. ‘‘చాలా కాలంగా ఏపీ అక్రమ మానవరవాణాకు అడ్డాగా ఉంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన సెక్సు కార్మికులు తగులుతారు. ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తీసిన లెక్కలు ఇవి. లెక్కలోకి రాకుండా మరికొన్ని వేలమంది ఉండి ఉంటారు’’ అని సామాజిక కార్యకర్త ఎన్ రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. సెక్సు వర్కర్ల సంక్షేమం కోసం ఆయన ఎన్జీవోను నడుపుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పోల్చితే ఏపీలో సెక్సు వర్కర్లు తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చూపినా.. వలస పోయినవారినీ కలుపుకొంటే ఆ రాష్ట్రమే తొలివరుసలో ఉంటుందని ఎస్. వాణీ అనే ఎన్జీవో వాదించారు.