పోస్టుల్లో మాట వినలేదని వేటు!
ABN , First Publish Date - 2022-10-19T10:09:52+05:30 IST
ప్రభుత్వ పెద్దలకు జై కొడితే అందలం! నిజాయితీ, నిబద్ధతలతో పనిచేస్తే అధఃపాతాళమే! ఇప్పుడు ఇదే విషయం మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ విషయంలో నిజమైనట్లు ఆ శా ఖ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అనురాధ అనూహ్య బదిలీ
స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో
‘అంగన్వాడీ సూపర్‌వైజర్’కు పరీక్షలు
పర్మినెంట్ పోస్ట్ కావడంతో వైసీపీ పైరవీలు
ఆమె సహకరించకపోవడంతో గుర్రు
ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ
ఆమె బాధ్యతలు ముద్దాడ రవిచంద్రకు
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెద్దలకు జై కొడితే అందలం! నిజాయితీ, నిబద్ధతలతో పనిచేస్తే అధఃపాతాళమే! ఇప్పుడు ఇదే విషయం మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ విషయంలో నిజమైనట్లు ఆ శా ఖ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన అంగన్వాడీ గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీలో రాజకీయ పైరవీలకు, సిఫారసులకు తావు ఇవ్వకుండా అనురాధ సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఇందుకు ఆమెను ప్రభుత్వం అభినందించాలి. కానీ, అందుకు భిన్నంగా బదిలీ వేటు వేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనురాధను ప్రింటింగ్-స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పరీక్షల ఫలితాల వెల్లడిలో జగన్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ పలువురు కోర్టుకు వెళ్లడంతో ఈవ్యవహారం ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అదేమీ తేలకుండానే అనురాధని వేరే విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర కుటుంబ ఆరోగ్యసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ము ద్దాడ రవిచంద్రను అనురాధ స్థానంలో మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
సిఫారసులపై పనిచేయలేదని..
మహిళా,శిశు సంక్షేమశాఖ పరిధిలోని గ్రేడ్-2 సూపర్‌వైజర్ అనేది పర్మినెంట్ పోస్టు. దీంతో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అంగన్వాడీల నుంచి పోస్టులు ఇప్పిస్తామంటూ రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు వసూ లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ సిఫారసులను అనురాధ పక్కనపెట్టినట్టు చెబుతున్నారు. ఆమె ఆ స్థానంలో ఉంటే తమ సిఫారసులు పనిచేయవనే ఉద్దేశ్యంతో ఆమె బదిలీకి సీఎంపై సదరు నేతలు గట్టిగా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తమ పార్టీ ప్రమేయం లేకుండా, పార్టీ వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి అనురాధ తిరస్కరిస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. ఇదేసమయంలో మహిళా, శిశు సంక్షేమశాఖలో డైరెక్టరేట్ స్థాయిలో చక్రం తిప్పే ఒక ఉన్నతాధికారి కూడా కొన్ని సిఫారసులతో సిద్ధమైనట్టు సమాచారం. ‘‘పోస్టులు మీకే వచ్చేలా చేస్తా’నంటూ పలువురు అంగన్వాడీల నుంచి మధ్యవర్తుల ద్వారా డబ్బులు వ సూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలో కోర్టు జోక్యంతో మొత్తంగానే నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఆమె శాఖ నిర్వహించిన పరీక్షలు కావడంతో... అనురాధ ఆ ప్రక్రియలో ఏదో తప్పు చేయడం వల్లే ప్రభుత్వం బదిలీ చేయిందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో కలిగించవచ్చునని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.