‘అమ్మ ఒడి’కి నిధులు లేకే!

ABN , First Publish Date - 2022-04-30T08:27:08+05:30 IST

వేసవి కాలం సెలవులు వర్షాకాలంలో ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? కానీ, రాష్ట్రంలో ఈ ఏడాది చూడబోతున్నారు. ఏటా జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం

‘అమ్మ ఒడి’కి నిధులు లేకే!

జూలై వరకు పాఠశాలల మూత

షెడ్యూల్‌కు భిన్నంగా సర్కారు తీరు.. మామూలుగా జూన్‌ 13న తెరవాలి 

కానీ జూలై 4 వరకు సెలవులు.. అమ్మ ఒడిని ఆలస్యం చేసే యత్నం

నిధులు సమకూరక కొత్త  వ్యూహం.. ఎప్పట్లానే తెరవాలని టీచర్ల పట్టు

జూలై పాటే పాడుతున్న సర్కారు..  ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వేసవి కాలం సెలవులు వర్షాకాలంలో ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? కానీ, రాష్ట్రంలో ఈ ఏడాది చూడబోతున్నారు. ఏటా జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం జూలైలో ప్రారంభిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులే ఒక్కోసారి ఎక్కువ సెలవులు కావాలని అడుగుతారు. కానీ, ఇప్పుడు వారు కూడా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా, విద్యా ప్రణాళిక దెబ్బతినకుండా ఉండేందుకు జూన్‌లోనే పాఠశాలు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం జూలైలోనే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని చెబుతోంది. జూలై 4నే పాఠశాలలు తెరుస్తామని ప్రకటించింది. ఇలా మొండి వైఖరి అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. రెండునెలల పాటు సెలవులివ్వాలన్న నిర్ణయం వెనక అసలు కారణం వేరే ఉందని విద్యాశాఖకు చెందినవారే అంటున్నారు. ‘అమ్మ ఒడి’ నిధులు సర్కారు వద్ద లేకపోవడంతోనే విద్యాసంవత్సరం ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మఒడికి ఇచ్చేందుకు నిధులు ‘నాన్న బుడ్డి’ నుంచి క్రమంగా రావాల్సి ఉంది. వచ్చిన డబ్బు వచ్చినట్లు వాడేయడంతో.. మళ్లీ మద్యంపై ఆదాయం రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ డబ్బు సమకూరాకే అమ్మఒడి ఇవ్వడం సాధ్యమవుతుంది.


అందుకే ఇలా స్కూళ్లను తెరిచే విషయంలో సర్కారు ‘వాయిదా’ విధానాన్ని ఎంచుకుందనే విమర్శలొస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే పాఠశాలలు తెరిస్తే అమ్మఒడి కింద తల్లులకు నిధులు జమచేయాలి. సరిపడా నిధులు లేకపోవడం వల్లే జూలై వరకు పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించినట్టు విద్యాశాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే అమ్మఒడి ఇచ్చేయాలి. అయితే, ఒక ఏడాది తప్పించుకోవడానికి.. జూన్‌లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనవరిలోనే అమ్మ ఒడి ఇచ్చి ఉంటే 2023 జనవరి, 2024 జనవరిలో కూడా అమ్మ ఒడి ఇవ్వాల్సి వచ్చేది. అలా కాకుండా జూన్‌లో ఇస్తే.. 2023, 2024లో కూడా జూన్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, 2024 ఏప్రిల్‌, మే నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ ప్రభుత్వం ఒక ఏడాది అమ్మఒడి నుంచి తప్పించుకున్నట్లే. ఐదేళ్లపాటు అమ్మఒడి ఇస్తానన్న ప్రభుత్వం.. నాలుగేళ్లే ఇచ్చి ఒక ఏడాది ఎగ్గొట్టేసినట్లు లెక్క. ఆ ప్రకారమే అయినా నూతన విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభించాలి. కానీ ఇప్పుడు ఇది కూడా సాధ్యం కావడం లేదు.  


ఒంటి పూట విషయంలో 

సాధారణంగా ఏటా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈనెల 2నుంచి ప్రారంభించారు. దాదాపు 17 రోజులు ఒంటిపూట బడులు ఆలస్యం చేశారు. దీనికి విద్యా ప్రణాళిక పూర్తికావాలనే కారణం చూపించారు. ఈ విషయంలో అలా చేసినవారు.. నూతన విద్యాసంవత్సరాన్ని షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభించడం లేదు. దీనికి కారణమూ చెప్పడంలేదు. మే 6 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించి, మళ్లీ జూలై 4న తిరిగి తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 13నే పాఠశాలలు తెరవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అప్పటికే 35రోజులు పైగా సెలవులు గడపడంతో విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చేందుకు సన్నద్ధమవుతారు. ఆ తర్వాత హడావుడి లేకుండా పాఠ్య ప్రణాళికను పూర్తిచేసేందుకు వీలవుతుందని సంఘాల నాయకులు చెబుతున్నారు.  

Updated Date - 2022-04-30T08:27:08+05:30 IST