3రాజధానులు కాదు.. 3రాష్ట్రాలు చేసుకోండి

ABN , First Publish Date - 2022-09-28T08:12:10+05:30 IST

ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తోందని, జగన్‌ ఇంట్లో పంచాయతీల కోసం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త గొడవలకు తెరతీయవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు

3రాజధానులు కాదు.. 3రాష్ట్రాలు చేసుకోండి

జగన్‌, షర్మిల, విజయసాయిరెడ్డి సీఎంలు అవ్వండి

మీ ఇంట్లో పంచాయితీకి తెలంగాణను బలిచేస్తారా?

ఏపీ సీఎంపై సంగారెడ్డి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం

షర్మిల ముమ్మాటికీ బీజేపీ కోవర్టే

నాతో ఆమెకు పంచాయితీ ఏమిటో అర్థంకావడంలేదు

రాజశేఖరరెడ్డి బిడ్డ కదా అని ఆలోచిస్తున్నా..

ఇకపై విమర్శిస్తే షర్మిల గురించి బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరిక


హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తోందని, జగన్‌ ఇంట్లో పంచాయతీల కోసం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త గొడవలకు తెరతీయవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి హితవు పలికారు.  ‘మూడు రాజధానుల అంశాన్ని పక్కనపెట్టి.. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఒప్పించి తీసుకోండి. అమరావతికి జగన్‌, కర్నూలుకు షర్మిల, విశాఖకు విజయసాయిరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టండి’ అని ఎద్దేవా చేశారు. ‘షర్మిల, జగన్‌ల మధ్య ఆస్తుల పంపకం గొడవలు ఉన్నట్లున్నాయి. ఇంట్లో పంచాయతీ తీర్చుకోలేక ఊరు మీద పడతానంటే ఎలా?’ అని జగన్‌ కుటుంబాన్ని జగ్గారెడ్డి  ప్రశ్నించారు. ఇక్కడి అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి..  మూడు రాజధానులుగా విభజించి ప్రాంతాలవారీ గొడవలు పెట్టడం తగదని జగన్‌కు హితవు పలికారు. వైఎస్‌ షర్మిలది పాదయాత్ర కాదని జగ్గారెడ్డి కొట్టి పారేశారు.


కాళ్లూ చేతులూ పట్టుకున్నా షర్మిలను తెలంగాణ ప్రజలు నమ్మబోరరన్నారు. తెలంగాణలో ఆమె గెలవదని జోస్యం చెప్పారు. రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలో బీజేపీకి అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల అనవరంగా న్యూసెన్సు చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ‘నాతో షర్మిలకు పంచాయతీ ఏమిటో అర్థం కావడం లేదు. అమ్మాయి కదా అని ఏమీ అనలేకపోతున్నాం. తమ నాయకుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని కూడా ఆలోచిస్తున్నాం.  అర్జెంటుగా సీఎం అయిపోవాలన్నదే ఆమె తాపత్రయం.  జగన్‌కు చెప్పి.. షర్మిలను సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నా’ అని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్‌కు తాను కోవర్ట్‌నని షర్మిలతో సహా తన పార్టీవాళ్లే బద్నాం చేయడం తనకు శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను టీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడే పులిలెక్క ఉన్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.


మునిసిపల్‌ ఎన్నికల్లో తనను పోలీసులు అరెస్టు చేస్తే .. ఆ సమయంలో మూడు మునిసిపాలిటీల్లో రిగ్గింగ్‌ చేసి టీఆర్‌ఎ్‌సను గెలిపించుకున్నానని  చెప్పారు. తన దమ్ము చూసే వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాంగ్రె్‌సలోకి పిలిచాడన్నారు. వైఎ్‌సకు నచ్చినా షర్మిలకు మాత్రం తాను నచ్చలేదని, ఇది షర్మిల రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘షర్మిల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వైఎస్‌ గుణగణాలు షర్మిలకు రాలేదు. షర్మిలలా చిల్లర మాటలు వైఎస్‌ దగ్గర లేవు. నన్ను వ్యభిచారి అని షర్మిల అన్నారు.. అదే మాట నేను ఆమెను అంటే ఎలా ఉంటుంది. శీలం గురించి షర్మిల మాట్లాడితే ఎలా?’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా.. ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా  మాట్లాడాలి. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. నా గురించి మళ్లీ నోరుజారితే నీకు సంబంధించిన చాలా విషయాలు బయటపెట్టాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. షర్మిల ముమ్మాటికీ బీజేపీ కోవర్టనని ఆరోపించారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వారధిగా ఉంటానని.. అన్ని మతాలకూ సమన్వయకర్తనని, షర్మిల మాదిరిగా బీజేపీకి ఏజెంట్‌ను కానని జగ్గారెడ్డి అన్నారు.

Read more