29న సంగం బ్యారేజీ ప్రారంభం!

ABN , First Publish Date - 2022-08-17T08:02:04+05:30 IST

29న సంగం బ్యారేజీ ప్రారంభం!

29న సంగం బ్యారేజీ ప్రారంభం!

నేడు అధికారిక ప్రకటన?

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ఈ నెల 29వ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సంబంధిత అధికారిక ప్రకటన బుధవారం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి జగన్‌ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసేనాటికే ఈ  బ్యారేజీ పనులు 82.86 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థకు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదనపు పనులు చేపట్టేందుకు మరో 7.89 కోట్లు ఇస్తే చాలని ప్రభుత్వం భావించింది. 2020 నవంబరు 11న జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నెల్లూరు, సంగం బ్యారేజీలను 2021 జనవరిలో ప్రారంభించాలని నిర్ణయించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను ప్రారంభిస్తే.. లష్కర్‌ పని చేశారని తనను ప్రతిపక్షాలు విమర్శిస్తాయని అనుకున్నారో ఏమో.. అప్పట్లో ప్రారంభించలేదు. తర్వాత కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రి హోదాలో ఉండగానే మృతి చెందారు. దీంతో సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టారు. ఈ బ్యారేజీని ఈ ఏడాది మే 15వ తేదీన ప్రారంభిస్తామని ఆత్మకూరు ఉప ఎన్నిక ముందు ప్రకటించారు. అది కూడా జరుగలేదు. ఇప్పుడు ఈ నెల 29వ తేదీన చేస్తామంటున్నారు. ఇదైనా కార్యరూపం దాల్చుతుందో.. లేక ఈ నెల 31న వినాయక చవితి ఉన్నందున.. చవితి ముందెందుకని వాయిదా వేస్తారో తెలియడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Read more