బాబు నివాసం వద్దే ఇసుక నిల్వలు

ABN , First Publish Date - 2022-10-11T09:43:13+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని

బాబు నివాసం వద్దే  ఇసుక నిల్వలు

వందలాది టిప్పర్లతో రోజంతా రవాణా

పూడిక పేరిట ఉండవల్లి కరకట్ట గుల్ల

తవ్వి చంద్రబాబు ఇంటికి దగ్గర్లో డంపింగ్‌

వీఐపీల మార్గంలో లారీల బారులు

విపక్ష నేత భద్రతపై భయాందోళనలు

డ్రెడ్జింగ్‌లో నిబంధనలన్నీ తూచ్‌!

బ్యారేజికీ ముప్పేనంటున్న నిపుణులు


మంగళగిరి, అక్టోబరు 10: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఇసుక తవ్వకాలు ఒక్కసారిగా పెరిగిపోవడం, తవ్విన ఇసుకను తరలించే వందలాది ట్రిప్పర్ల కదలికలు రాత్రింబవళ్లు కొనసాగుతుండటం విపక్ష నేత రక్షణపై ఆందోళనను పెంచుతున్నాయి. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఆయన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు కమాండోల రక్షణను పెంచుతూ మోదీ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చంద్రబాబుకు డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రౌండ్‌ ది క్లాక్‌ పన్నెండేసి మంది కమాండోలను కేటాయించారు. అయినా.. ఆయన భద్రతకు పూర్తిగా ఇంకా ముప్పు తొలగిపోలేదని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. పూడిక కారణంగా కృష్ణా రిజర్వాయర్‌ నీటి సామర్ధ్యం తగ్గిపోయిందంటూ, జగన్‌ ప్రభుత్వం గతేడాది ఎగువ కృష్ణలో మొత్తం 12 చోట్ల డ్రెడ్జింగ్‌ ద్వారా పూడికతీత పనులకు అనుమతులు ఇచ్చింది.


ఇందులోభాగంగా ఉండవల్లి కరకట్ట వెంబడి చంద్రబాబు నివాసం వెనుకవైపు కూడా డ్రెడ్జింగ్‌ పనులను ప్రారంభించేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడి పనులు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. అంతా అందుకు విరుద్ధంగానే సాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం వెనుకవైపు సుమారు ఐదారొందల మీటర్ల దూరంలో ఉన్న ర్యాంపు వద్ద డ్రెడ్జింగ్‌ చేపడుతున్నారు. అక్కడ ఇసుకను తోడి చంద్రబాబు ఇంటికి అతి సమీపంలో డంపింగ్‌ చేస్తున్నారు. ఈ యార్డులో ఇసుక నిల్వలు ఓస్థాయికి చేరాక డ్రెడ్జింగ్‌ పనులకు తాత్కాలిక విరామం ఇస్తున్నారు. డ్రెడ్జింగ్‌ చేసే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో కూడ పనులు కొనసాగిస్తున్నారు. భారీ కోత మిషన్‌లను వాడుకోవచ్చునని ప్రభుత్వం టెండర్లలో అవకాశం కల్పించింది. దీనివల్ల కృష్ణా కరకట్ట దెబ్బతింటోందని ఉండవల్లి వాసులు కొద్దిరోజుల కిందట ఆందోళన కూడా చేశారు. పరిమిత స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా డ్రెడ్జింగ్‌ పనులు జరిగితే ఫర్వాలేదు. కానీ...ఇష్టానుసారంగా పనులు చేస్తే ఏకంగా ప్రకాశం బ్యారేజి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


బాబును ఖాళీ చేయించేందుకేనా?

కృష్ణానది ఇసుక నిల్వలపై పాలకపక్ష పార్టీ నాయకులు బాగా కన్నేసినట్టు కనిపిస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కృష్ణాకరకట్ట వెంబడి గత కొన్నాళ్లుగా జరుగుతున్న వ్యవహరాలే ఇందుకు నిదర్శనమని వాదిస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీ అదే పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేను సైతం పూర్తిగా పక్కకు నెట్టేసి పెద్దఎత్తున ఇసుకదందా కొనసాగించారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ గొడవ వైసీపీలో ఒకదశలో పెనుతుఫానునే సృష్టించింది. అదే సందర్భంలో కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూడా ఖాళీ చేయించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించిన సంగతిని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇసుక దందాను యథేచ్ఛగా సాగించేందుకు ప్రతిపక్ష నేత నివాసం అధికార పక్ష నేతలకు ఓ అడ్డుగా ఉందని.. దానిని ఖాళీ చేయించేందుకు వరదలను సైతం వాడుకున్నారని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా కరకట్ట రోడ్డును రూ.200 కోట్ల వ్యయంతో విస్తరించడం వెనుకా ఇసుక దందా అవసరాలే పనిచేశాయని వాదిస్తున్నారు.


మరోవైపు రాష్ట్రమంతటా ఇసుక రవాణాను గంపగుత్తగా చేజిక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ...గత కొంతకాలంగా ఆ పనులను ఏరియాల వారీగా సబ్‌ కాంట్రాక్టులకు ఇచ్చివేస్తోంది. చంద్రబాబు నివాసం వెనుకఉన్న ఇసుక డంపింగ్‌యార్డు నుంచి ఇసుక అమ్మకాలను మొన్నమొన్నటి వరకు టర్న్‌కీ అనే సంస్థ చూసింది. తాజాగా కేకేఆర్‌ అనే సంస్థ నిర్వహణలో ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం టన్ను ఇసుకను 550 రూపాయల వంతున విక్రయించాలని ఆదేశించగా, దానిని 700 రూపాయల నుంచి  వేయి రూపాయల వరకు విక్రయిస్తున్నారని అంటున్నారు. ఉదయం , సాయంకాలం వీఐపీల రాకపోకల అనంతరం డంపింగ్‌యార్డు నుంచి ఇసుక రవాణా పెద్దఎత్తున సాగుతోంది. రాత్రిళ్లయితే టిప్పర్ల హోరుతో కరకట్ట బేజారెత్తిపోతోంది. సాఽధారణంగా డంపింగ్‌ యార్డునుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను ఓ ప్రత్యేక ప్రదేశంలో నిలుపుకోవాలని నిబంధనలు ఉన్నాయి. కానీ...ఇరుకుగా ఉండే ఉండవల్లి కరకట్టపై.. అదీ చంద్రబాబు నివాసానికి అతి సమీపంలోనే వందలాది టిప్పర్లు ఆగి ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఉండవల్లి గుహాలయాల వైపునుంచి కరకట్ట వైపుకెళ్లే సాధారణ పౌరులను సైతం వీఐపీల భద్రతాకోణంలో పోలీసులు అడ్డగిస్తుంటారు. అలాంటప్పుడు కరకట్టపై అడ్డగోలుగా తిష్ఠవేసి ఉంటున్న ఇసుక టిప్పర్ల విషయంలో ఎందుకు మౌనం దాలుస్తున్నారో అర్ధం కావడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more