Sajjala Ramakrishna Reddy: ఇన్నేళ్ల తర్వాత ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2022-12-13T03:29:52+05:30 IST

ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలవడం ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం నిలబడిన ఏకైక పార్టీ వైసీపీయేనని.. అలాంటి తమను సుప్రీం కోర్టులో లాయరు చేసిన వ్యాఖ్యతో ఇరుకునపడేయాలని చూస్తున్నారని సజ్జల అసహనం వ్యక్తం చేశారు.

Sajjala Ramakrishna Reddy: ఇన్నేళ్ల తర్వాత ఎలా సాధ్యం?

ఆంధ్ర, తెలంగాణ కలయికపై మాటమార్చిన సజ్జల

సుప్రీంలో లాయర్‌ చేసిన వ్యాఖ్యతో

వైసీపీని ఇరుకునపెట్టాలని చూస్తున్నారు

కలిసిపోవాలని కోర్టు తీర్పు ఇస్తే

స్వాగతిస్తామని గతంలో అన్నాను

వాటిపై రాజకీయం తగదు: సలహాదారు

అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలవడం ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం నిలబడిన ఏకైక పార్టీ వైసీపీయేనని.. అలాంటి తమను సుప్రీం కోర్టులో లాయరు చేసిన వ్యాఖ్యతో ఇరుకునపడేయాలని చూస్తున్నారని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే పొంగి వెళ్లిపోయిన నీరు తిరిగిరాదు. ఒకవేళ తిరిగి కలవడం ఉంటే.. మా అభిప్రాయం ఇదీ అని ఆ రోజున నేనలా చెప్పాను’ అని తెలిపారు. రాష్ట్రానికి సీఎం జగన్‌ ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాలు కలవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే తొలుత వైసీపీయే స్వాగతిస్తుందని ఈ నెల 8వ తేదీన ప్రకటించిన సజ్జల.. తాజాగా మాటమార్చారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలోని మీడియా సెంటర్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జగన్‌ ద్రోహం చేస్తున్నారంటూ ఉండవల్లి చేసిన ఆరోపణలపై తాను ఆనాడు మాట్లాడానని.. సమైక్య రాష్ట్రం కోసం వైసీపీ తొలి నుంచి పోరాడుతోందని చెప్పానని అన్నారు. ఎనిమిదేళ్లు దాటినా రాష్ట్ర విభజనపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉందన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం, అసెంబ్లీ తీర్మానం ప్రకారం విభజన జరగలేదని కోర్టు గనుక చెబితే.. సమైక్య రాష్ట్రమే మా విధానమని చెప్పానని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఆర్థిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు

రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు నిజమని.. దానిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా వచ్చే ఆర్థిక సమస్యలను జగన్‌ అధిగమిస్తారని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం మొత్తం ప్రజల బాగోగులు చూడాల్సి ఉందని చెప్పారు. శతాబ్దాల పాటు లేని భూసర్వేను ఇప్పుడు చేస్తున్నామని.. దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ క్రెడిటంతా రెవెన్యూ ఉద్యోగులకు దక్కుతుందని తెలిపారు. భూసర్వేపై ఉద్యోగులకు ఒత్తిడి ఉంటే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. వలంటీర్‌ వ్యవస్థపై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదని.. జన్మభూమి కమిటీల పేరిట ఆయన ఏం చేశారని అడిగారు. పవన్‌ కల్యాణ్‌ ప్రచారవాహనం ‘వారాహి’పై తమ నేతల మాటలు నిజమని తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సరికాదని సజ్జల వ్యాఖ్యానించారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలంటూ చంద్రబాబు అనడం సరికాదని.. చంద్రబాబే సైకో అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు.

కేసీఆర్‌ మద్దతు కోరితే ఆలోచిస్తాం

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)కు మద్దతివ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరితే ఆలోచిస్తామని సజ్జల అన్నారు. రాజకీయ పార్టీగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. తమకు మాత్రం తమిళనాడు, కర్ణాటకల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పారు. తమ అధ్యక్షుడు రాష్ట్ర సంక్షేమంపైనే దృష్టి సారించారని తెలిపారు.

Updated Date - 2022-12-13T03:29:53+05:30 IST