Saichand: ‘అమరజీవి’కి సాయిచంద్ అరుదైన నివాళి
ABN , First Publish Date - 2022-12-15T03:41:43+05:30 IST
ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి నేడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సరమయోధుడు త్రిపురనేని రామస్వామి మనవడు, ప్రముఖ నటుడు త్రిపురనేని సాయిచంద్ అమరజీవికి అరుదైన నివాళి అర్పిస్తున్నారు.
చెన్నై స్మారక మందిరం నుంచి స్వగ్రామం పడమటిపల్లెకు
నేటి నుంచి ‘కాలినడకన దీక్ష’
చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి నేడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సరమయోధుడు త్రిపురనేని రామస్వామి మనవడు, ప్రముఖ నటుడు త్రిపురనేని సాయిచంద్ అమరజీవికి అరుదైన నివాళి అర్పిస్తున్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నైలోని స్మారకమందిరం నుంచి ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పడమటిపల్లె వరకు ‘కాలినడకన దీక్ష’ చేపట్టనున్నారు. గురువారం మధ్యాహ్నం ఈ కాలినడకన దీక్ష ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సాయిచంద్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ‘‘అమరజీవి త్యాగాన్ని ఈ తరం వారికి గుర్తు చేయడమే నా దీక్ష లక్ష్యం. చెన్నై నుంచి పడమటిపల్లె 290 కిలోమీటర్లు ఉంటుంది. దీక్ష పూర్తయ్యేందుకు 10 నుంచి 12 రోజులు పడుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.