మళ్లీ తెరపైకి రూరల్‌ సర్వీస్‌

ABN , First Publish Date - 2022-08-18T08:35:50+05:30 IST

‘‘రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదువుతున్న జూనియర్‌ వైద్యులకు రూరల్‌ సర్వీ్‌సను ప్రారంభించండి.

మళ్లీ తెరపైకి  రూరల్‌ సర్వీస్‌

  • మళ్లీ తెరపైకి రూరల్‌ సర్వీస్‌
  • ఎంబీబీఎస్‌ విద్య అనంతరం అమలు
  • ఆరోగ్యశాఖ అధికారుల ప్రతిపాదన
  • వెంటనే కసరత్తు చేయాలని సీఎం ఆదేశం
  • 5 నుంచి ఆరోగ్యశ్రీలోకి కొత్త ప్రొసీజర్లు
  • విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి


అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదువుతున్న జూనియర్‌ వైద్యులకు రూరల్‌ సర్వీ్‌సను ప్రారంభించండి. డాక్టర్ల కొరతను అధిగమించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండి’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టతో పాటు, ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్‌ పెంచే అంశాలపైనా చర్చించారు. రూరల్‌ సర్వీస్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించాలంటే ఎంబీబీఎస్‌ తర్వాత రూరల్‌ సర్వీ్‌సను అమలు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. వెంటనే కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో పాటు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టను సమర్థంగా అమలు చేయాలన్నారు. దీనికోసం మూడు అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రతి పీహెచ్‌సీలోనూ పూర్తిస్థాయిలో సిబ్బందిని, అవసరమైన అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. 


ఈ పనులన్నీ ప్రతిరోజూ పరిశీలించేందుకు ఆరోగ్యశాఖ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశా వర్కర్లు ఉంటారన్నారు. 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పిలవాలని సీఎం ఆదేశించారు. బూస్టర్‌ డోస్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఆరోగ్యశ్రీలోకి కొత్త చికిత్సా విధానాలను పెంచే అంశాన్ని సీఎం వాయిదా వేస్తూ వస్తున్నారు. గత సమీక్షలో ఆగస్టు 1 నుంచి కొత్త ప్రొసీజర్లు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పుడు వచ్చేనెల 5 నాటికి  అందుబాటులోకి రావాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 2,433 ప్రొసీజర్లు అమలు చేస్తున్నామని, అదనంగా మరో 754 ప్రొసీజర్లు చేర్చాలని నిర్ణయించినట్లు సీఎం వివరించారు. 


పార్వతీపురం జిల్లాలో కొత్త మెడికల్‌ కాలేజీ..

పార్వతీపురం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ కార్యకలాపాలన్నీ అదే జిల్లాకు చెందిన వైద్యకళాశాల నేతృత్వంలో జరగాలన్నారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డైరెక్టర్‌ జె నివాస్‌ పాల్గొన్నారు.

Read more