ఈగలపెంట-శ్రీశైలం మధ్య రోప్ వే
ABN , First Publish Date - 2022-12-15T03:33:00+05:30 IST
కేంద్ర ప్రభుత్వ పర్వత మాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటుకు ఏపీ పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మార్చిలో టెండర్లు!
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పర్వత మాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటుకు ఏపీ పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈగలపెంట- శ్రీశైలం మధ్య రోప్ వే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ తెలిపారు. మార్చి నుంచి రోప్‌వే ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. ఈగలపెంట-శ్రీశైలం మధ్య రోప్ వేతో పాటు మరో మూడు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వే ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ఐల్యాండ్ వరకు, అలాగే లంబసింగి, గండికోట పర్యాటక ప్రాంతాల్లోనూ రోప్ వే ఏర్పాటుకు పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం ఆమోదిస్తే ఏప్రిల్, మే నెలల్లో వీటికి కూడా టెండర్లు ఆహ్వానించనున్నారు. పర్యాటక శాఖ ఒక్కో ప్రాజెక్టుకు రూ.400 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పరిధిలో రోప్ వే పనులు జరగనున్నాయి.