పేదల ఇళ్లపై రోడ్డు విస్తరణ కత్తి!

ABN , First Publish Date - 2022-11-24T03:46:47+05:30 IST

రోడ్డు విస్తరణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చంద్రయ్యనగర్‌లో అధికారులు బుధవారం ఇళ్ల తొలగింపు...

పేదల ఇళ్లపై రోడ్డు విస్తరణ కత్తి!

గుంటూరులో నోటీసులివ్వకుండానే కూల్చివేత!

గుంటూరు(కార్పొరేషన్‌), నవంబరు 23: రోడ్డు విస్తరణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చంద్రయ్యనగర్‌లో అధికారులు బుధవారం ఇళ్ల తొలగింపు చర్యలకు దిగారు. స్థానిక ఠాగూర్‌బొమ్మ వద్ద నుంచి అమరావతి రోడ్డు వరకు ప్రస్తుతం ఉన్న 50 అడుగుల రోడ్డును మరో పది అడుగులు విస్తరించేందుకు వరుసగా ఇళ్లను కూల్చుకుం టూ వస్తున్నారు. మొత్తం 51 ఇళ్లు ఉండగా.. బుధవారం నాలుగు ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. మరో 16 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపే చర్యలు కూడా చేపట్టకుండా కూల్చివేతలకు దిగడం దారుణమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై మండిపడ్డారు. నిలువ నీడ లేదని, ఉన్నఫళంగా ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు ఎక్స్‌కవేటర్‌ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు. పలువురు బాధితులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల చర్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాగా, రోడ్డు విస్తరణకు మార్కింగ్‌ చేసిన మేరకు గురువారం నాటికి పూర్తిగా ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-11-24T03:46:56+05:30 IST

Read more