బూతు పురాణం రివర్స్‌!

ABN , First Publish Date - 2022-06-15T08:14:07+05:30 IST

బూతు పురాణం రివర్స్‌!

బూతు పురాణం రివర్స్‌!

ఇప్పటిదాకా ప్రతిపక్షాలపైనే ఆ అస్త్రం

ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనా బూతులే

బందరులో ఎంపీ బాలశౌరి - ఎమ్మెల్యే పేర్ని

గన్నవరంలో వంశీ - యార్లగడ్డ వెంకట్రావ్‌

నరసాపురంలో కొత్తపల్లి - ప్రసాదరాజు

విశాఖ సౌత్‌లో సీతంరాజు -  వాసుపల్లి


టెండర్లు తదితర ప్రతి విషయంలోనూ రివర్స్‌ బాట పయనించే వైసీపీకి బూతు పురాణంలో కూడా రివర్స్‌ అచ్చొచ్చినట్టు కనిపిస్తోంది. వయసు, పాలనానుభవం వంటివి సైతం చూడకుండా ప్రతిపక్ష నేతలపై బూతులతో చెలరేగిపోయే ఆ పార్టీ నేతలు ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనా అదే బూతుపురాణంతో విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో తమకు తరతమ బేధం లేదని, తమకు ఎదురొస్తే ఎవరైనా ఒక్కటేనన్న వైఖరి అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రులు జోగి రమేశ్‌, అంబటి రాంబాబు ఏకవచన ప్రయోగంతో విరుచుకుపడటంతోపాటు మధ్యమధ్యలో బూతులు మాట్లాడటం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. కొడాలి నానిని బూతుల మంత్రిగా కూడా పేర్కొనేవారు. జోగి రమేశ్‌నూ బూతుల ఘనాపాటిగానే చెబుతున్నారు. మాజీ మంత్రి అనిల్‌ కూడా ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడేవారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీతో సహజీవనం చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ నోట్లోంచి కూడా అప్పుడప్పుడు బూతులు వస్తుంటాయి. ఇప్పటి వరకూ ప్రతిపక్షనేతలపైనే బూతులతో విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనా బూతు పురాణాన్ని ప్రయోగిస్తున్నారు. 


చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుతో కొత్తపల్లి ఢీ.. 

నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరు ప్రసాదరాజుతో ఢీ కొట్టారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భీమవరంను జిల్లా కేంద్రం చేయడంపై కొత్తపల్లి విభేదించారు. అప్పటి నుంచి ప్రసాదరాజుతో ఆయనకు ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానని సవాలు విసిరిన కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. 


సీతంరాజు వర్సెస్‌ వాసుపల్లి గణేశ్‌..

విశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు, టీడీపీ వలసనేత వాసుపల్లి గణేశ్‌ మధ్య లడాయి తీవ్రస్థాయికి చేరింది. సీతంరాజుకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సమన్వయకర్త పదవికి గణేశ్‌ ఇటీవల రాజీనామా చేశారు. గణేశ్‌ వ్యవహారాన్ని తాడేపల్లి ప్యాలెస్‌ సీరియ్‌సగా తీసుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


నెల్లూరులో నివురుగప్పిన నిప్పు..

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరినీ తాడేపల్లి ప్యాలె్‌సకు రప్పించి చర్చలు జరిపిన తర్వాత స్తబ్దుగా ఉంది. అయితే ఇది ఎంతకాలం అనే చర్చ వైసీపీలో జరుగుతోంది.


వంశీతో యార్లగడ్డ అమీతుమీ

కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అమీతుమీకి సిద్ధపడ్డారు. తీవ్ర పదాలతో ఇద్దరూ విమర్శలు చేసుకొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ గెలిచిన వంశీ, అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వంశీ, యార్లగడ్డ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.  వీరిద్దరి మధ్య రచ్చ రోడ్డెక్కడంతో జోక్యం చేసుకునేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇంతకాలం పార్టీని మోస్తోన్న వెంకట్రావును సమర్థించాలా? లేదంటే శాసనసభ్యుడిగా ఉన్న వంశీని సమర్థించాలా? అనేదానిపై తాడేపల్లి ప్యాలెస్‌ స్పష్టతకు రాలేకపోతోందని చెబుతున్నారు. అయితే, సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీని సమర్థిస్తే.. భవిష్యత్తు ఎన్నికల సమయంలో అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఆయన వైసీపీకి ఎదురు తిరిగితే ఎలా అనే సందేహాలూ ఉన్నాయని అంటున్నారు. మరో ఆరు నెలల్లో పార్టీ పరమైన సర్వే చేయనున్నందున, ఆతర్వాతే  దీనిపై స్పష్టత ఇద్దామనే యోచనలో అధిష్ఠానం ఉందంటున్నారు. 


బాలశౌరి వర్సెస్‌ పేర్ని 

మచిలీపట్నంలో లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ప్రత్యక్ష యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన వీరిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇది బాహాటంగా బూతులు తిట్టుకునే స్థాయికి చేరింది. పరిస్థితి ఇంతగా దిగజారుతుందని వైసీపీ అధిష్ఠానం కూడా గుర్తించలేకపోయింది. సద్దుమణిగే పరిస్థితి కనిపించకపోవడంతో  ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో అధిష్ఠానం పడింది. తమ వద్దకు వచ్చి చర్చలు జరిగేదాక మౌనం దాల్చాలని, నిందారోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటూ ఇద్దరినీ తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశించింది. 

Updated Date - 2022-06-15T08:14:07+05:30 IST