మాజీ మంత్రి నారాయణకు ఊరట

ABN , First Publish Date - 2022-12-07T02:42:25+05:30 IST

టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి పి.నారాయణకు ఉపశమనం లభించింది.

మాజీ మంత్రి నారాయణకు ఊరట

బెయిల్‌ రద్దు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి పి.నారాయణకు ఉపశమనం లభించింది. బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ప్రాసిక్యూషన్‌ తన వాదనలు వినిపించుకునేందుకు మేజిస్ట్రేట్‌ కోర్టు అవకాశం ఇవ్వలేదని సెషన్స్‌ కోర్టు పేర్కొనడాన్ని తప్పుబట్టింది. నిందితుడిగా ఉన్న పిటిషనర్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టింది పోలీసులేనన్న విషయాన్ని సెషన్స్‌ కోర్టు గుర్తించకపోవడాన్ని ఆక్షేపించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టు ముందు హాజరయ్యేలా చూసుకోవలసిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనని స్పష్టం చేసింది. విచారణకు హాజరు కానందుకు సంబంధిత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని విచారణ సందర్భంగా పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొంది. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన వివరాల ఆధారంగా మేజిస్ట్రేట్‌ కోర్టు సరైన నిర్ణయం తీసుకుందా లేదా అనే అంశంపై లోతుల్లోకి వెళ్లి పరిశీలించకుండా.. కేవలం ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఇవ్వలేదనే కారణంతో మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను రద్దు చేస్తూ సెషన్స్‌ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని తప్పుబట్టింది.

ఈ నేపథ్యంలో ఆ తీర్పును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే మేజిస్ట్రేట్‌ కోర్టు పిటిషనర్‌ను రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని స్పష్టం చేసింది. రిమాండ్‌ నిరాకరిస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మెరిట్స్‌ ఆధారంగా విచారణ జరిపి నాలుగు వారాల్లో రివిజన్‌ పిటిషన్‌పై తేల్చాలని సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. అప్పటి వరకు పిటిషనర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. నారాయణ వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు మంగళవారం ఆదేశాలిచ్చారు. టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రిమాండ్‌ను నిరాకరిస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌.. పోలీసుల తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి.. మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.

Updated Date - 2022-12-07T02:42:26+05:30 IST