రేషనలైజేషన్‌ రయ్‌.. రయ్‌!

ABN , First Publish Date - 2022-06-15T09:04:32+05:30 IST

రేషనలైజేషన్‌ రయ్‌.. రయ్‌!

రేషనలైజేషన్‌ రయ్‌.. రయ్‌!

వ్యతిరేకత వస్తున్నా ముందుకే

53 మంది విద్యార్థులు దాటితేనే 6-8 తరగతుల్లో అదనపు సెక్షన్‌

అన్ని చోట్లా ఉపాధ్యాయుల 

సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ


అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌)పై ఎంత వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్తోంది. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. అదేసమయంలో విద్యార్థులు, ఉపాఽధ్యాయుల నిష్పత్తిలో మరో అడుగు ముందుకేసింది. గతంలో 6-8 తరగతుల్లో విద్యార్థులు, ఉపాఽధ్యాయుల నిష్పత్తి 1:35 ఉండగా.. ప్రభుత్వం దాన్ని 1:45గా మార్చింది.  దీనిపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతమంది విద్యార్థులకు ఒక టీచరంటే విద్యా నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తంచేశారు. అయితే వీటిని ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ నిష్పత్తిని మరింత పెంచడం గమనార్హం. సోమవారం రేషనలైజేషన్‌ అమలు ఎలా చేయాలన్న దానిపై ఉత్తర్వులిచ్చారు. 53 మంది విద్యార్థులుంటేనే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.  9, 10 తరగతుల్లో ఈ విద్యార్థుల సంఖ్య 60కి మించితేనే అదనపు సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉపాఽధ్యాయుల రేషనలైజేషన్‌ను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. 


రేపటిలోపు పూర్తి

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు, హేతుబద్ధీకరణ జాబితాలను రూపొందించి ఈ నెల 16వ తేదీలోగా(గురువారం) పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆర్జేడీలు, డీఈవోలు ఈ మేరకు బాధ్యత తీసుకుని పనిచేయాలని సూచించింది. సబ్జెక్టు మార్పిడి పోస్టులు, పదోన్నతులు ఇవ్వాల్సిన సెకండరీ గ్రేడ్‌ టీచర్ల జాబితాల్లో తేడాలుంటే ఆ జాబితాలు రూపొందించిన వారిపై తీవ్ర క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. 


తొలిదశ: మొదటి దశలో ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం? ఎంతమంది ఉన్నారు? మిగులు ఎంతమంది? లోటు ఎంతమంది? అన్నది గుర్తించాలి. ఇలా లోటు, మిగులును గుర్తించేందుకు తరగతికి ఎంతమంది విద్యార్థులుండాలన్న లెక్క ప్రకారం వెళ్లాలి. మరోవైపు సబ్జెక్టు టీచర్లను కేటాయించేందుకు ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు విలీనం అయ్యే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున ఈ పనిచేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ప్రాథమిక హైస్కూల్‌లో 195మంది విద్యార్థులుంటే హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయడానికి, అప్‌గ్రేడ్‌ చేసిన హైస్కూళ్లకు సబ్జెక్టు టీచర్లను కేటాయించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలి. 98 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకే సబ్జెక్టు టీచర్లను ఇస్తారు. లేకుంటే సెకండరీ గ్రేడ్‌ టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తారు. 

రెండోదశ: ఈ దశలో.. మిగులు పోస్టులను అవసరం ఉన్న చోటకు బదిలీ చేస్తారు. అంటే ఒక పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్లుగా పరిగణిస్తే.. వారిని అవసరం ఉన్న వేరే పాఠశాలకు పంపిస్తారు. అదే సమయంలో ఒక్కోచోట 10 మంది గణిత ఉపాధ్యాయుల పోస్టులు మిగులుంటే.. ఇంకో పాఠశాలలో 8 మంది లెక్కలు, ఇద్దరు ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుల అవసరం ఉంది. అలాంటప్పుడు 8మందిని లెక్కలకు తీసుకుని, ఆ మిగిలిన ఇద్దరు మిగులు ఉపాధ్యాయుల్ని ఇక్కడ కావాల్సిన ఇద్దరు ఫిజికల్‌ టీచర్ల పోస్టుల్లోకి తీసుకోవచ్చు. లెక్కలు, ఫిజికల్‌ సైన్స్‌కు మాత్రమే ఈ మార్పిడికి అవకాశం కల్పించారు.

మూడోదశ: ఈ దశలో సబ్జెక్టు టీచర్లు ఇంకా అవసరమైతే ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి స్కూల్‌ అసిస్టెంట్లుగా పంపిస్తారు.


గిరిజన స్కూళ్లలో బదిలీలు

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-2 ప్రధానోపాధాయులు, ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతిస్తూ గిరిజన సంక్షేమ శాఖ డైరక్టర్‌ గంధం చంద్రుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీనాటికి బదిలీలు పూర్తికావాలని పేర్కొన్నారు. దీని ప్రకారం కేటగిరీ 4 ప్రాంతాల్లో పనిచేసినవారికి ఏడాదికి 5 పాయింట్లు, కేటగిరీ 3లో పనిచేసిన వారికి 3 పాయింట్లు, కేటగిరీ రెండులో పనిచేసినవారికి 2 పాయింట్లు, కేటగిరీ ఒకటిలో పనిచేసినవారికి ఏడాదికి 1 పాయింటు చొప్పున బదిలీల్లో వెయిటేజి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఉత్తర్వుల పట్ల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు ప్రభుత్వంలో విలీనం అయిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కూడా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయంపై పాఠశాల విద్యా కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-06-15T09:04:32+05:30 IST