కొత్త డిస్పెన్సరీలకు రాం రాం!
ABN , First Publish Date - 2022-06-29T09:09:54+05:30 IST
కొత్త డిస్పెన్సరీలకు రాం రాం!

2018లో 16 ఈఎ్‌సఐ ఆస్పత్రుల ఏర్పాటు
వైద్య సిబ్బంది నియామకానికి సహకరించని డైరెక్టరేట్
మూడేళ్ల నుంచీ లేఖలు రాస్తున్నా స్పందన లేదు
వృథాగా పడి ఉన్న లక్షల విలువైన ఫర్నిచర్
రంగంలోకి కేంద్ర కార్పొరేషన్ అధికారులు
డిస్పెన్సరీలను క్లోజ్ చేయాలని నిర్ణయం
ఇప్పటికే ముత్తుకూరు, వరదాయపాలెంలో క్లోజ్
మరో 12 ఆస్పత్రులకు నోటీసులు
చోద్యం చూస్తున్న సర్కారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏపీలో కార్మికుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎ్‌సఐ) ఆస్పత్రులు, డిస్పెన్సరీలను అసలే పట్టించుకోవడం లేదు. దీంతో ఈఎ్‌సఐ వ్యవస్థ మొత్తం తీవ్ర ప్రమాదంలో పడింది. కార్మికులకు వైద్యం అందే పరిస్థితి చేజారిపోతోంది. ‘కోట్ల రూపాయిలు నిధులిస్తాం... అవసరం మేరకు సాయం చేస్తాం. మీరు కార్మికుల ఆరోగ్యం చేసుకోండి... నిధులు సంగతి మేము చూసుకుంటామ’ని కేంద్ర కార్పొరేషన్ చెబుతున్నా ఈఎ్‌సఐ డైరెక్టరేట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడంపై కార్పొరేషన్ గుర్రుగా ఉంది. దీంతో నేరుగా యాక్షన్‌లోకి దిగింది. చేతకాకపోతే తమకు స్వాధీనం చేయాలని కొన్ని నెలల క్రితమే లేఖలు రాశారు. దానికీ.. అటు ప్రభుత్వం, ఇటు డైరెక్టరేట్ అధికారులు స్పందించకపోవడంతో రాష్ట్రంలో ఉన్న మొత్తం 16 డిస్పెన్సరీల్లో ఏకంగా 12 ఆస్పత్రులను మూసివేసేందుకు నిర్ణయియించింది.
ప్రభుత్వం సహకరిస్తే చాలు...
కేంద్రం సూచనల మేరకు ఈఎ్‌సఐ కార్పొరేషన్.. అసంఘటిత రంగంలోని కార్మికుల సౌకర్యార్థం డిస్పెన్సరీలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్మాణం చేపడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ఈఎ్‌సఐ డైరెక్టరేట్ అధికారులు కాస్త సహకారం అందిస్తే చాలు.. మొత్తం కార్పొరేషనే చూసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 78 ఈఎ్‌సఐ డిస్పెన్సరీలు కాకుండా.. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం కొత్తగా డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే వాటి ఖర్చు మొత్తం కార్పొరేషన్ చూసుకుంటుంది. మూడేళ్ల పాటు వాటి నిర్వహణ ఖర్చు మొత్తం చెల్లిస్తుంది. ఏపీ ప్రభుత్వం కేవలం డిస్పెన్సరీల్లో విధులు నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచితే సరిపోతుంది. శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ 16 ప్రదేశాల్లో డిస్పెన్సరీల ఏర్పాటుకు కార్పొరేషన్ అంగీకరించింది. 16 చోట్ల ప్రయివేటు భవనాలను అద్దెకు తీసుకుంది. వాటికి నెల నెలా రూ.25 వేల నుంచి 45 వేల వరకూ అద్దెలు చెల్లిస్తోంది. అవసరమైన ఫర్నిచర్ మొత్తం కొనుగోలు చేసి జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి తరలించింది. సిబ్బందిని అందుబాటులోకి తీసుకువస్తే వెంటనే డిస్పెన్సరీలు ప్రారంభమవుతాయి. అయితే, సిబ్బంది నియామకం పట్ల 2019 నుంచి ఇదిగో.. అదిగో అంటూ ఈఎ్‌సఐ డైరెక్టరేట్ అధికారులు కాలం గడుపుతూ వస్తున్నారు. మూడేళ్లు కావస్తున్నా దీనిపై ప్రభుత్వం కూడా దృష్టిపెట్టలేదు. డిస్పెన్సరీలైతే ఏర్పాటు చేశారు కానీ.. అవి గత మూడేళ్ల నుంచి మూతపడే ఉంటున్నాయి. వెంటనే సిబ్బంది నియామకం చేపడితే డిస్పెన్సరీలు ప్రారంభిద్దామని మూడేళ్ల నుంచీ కార్పొరేషన్ మొత్తుకుంది. జాయింట్ డైరెక్టర్ కార్యాలయాల్లో ఫర్నిచర్ చెదలు పట్టే పరిస్థితికి వచ్చింది. డైరెక్టరేట్ నిర్లక్ష్యంపై కార్పొరేషన్ అధికారులు గత కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. దీంతో వారం రోజుల క్రితం డైరెక్టరేట్‌కు కార్పొరేషన్ అధికారులు ఒక లేఖ రాశారు. ‘మీ వల్ల మాకు ఆడిట్ సమస్యలు వస్తున్నాయి. మూడేళ్లుగా డిస్పెన్సరీలు ప్రారంభం కాకపోవడం దారుణం. కార్పొరేషన్లో ఉన్న మమ్మల్ని సస్పెండ్ అయినా చేస్తారు. డిసిప్లీనరీ యాక్షనైనా తీసుకుంటారు.’’ అంటూ ఘాటు లేఖ రాశారు. అయినా డైరెక్టరేట్ అధికారుల్లో చలనం లేదు. దీంతో కార్పొరేషన్ అధికారులు నేరుగా యాక్షన్‌లోకి దిగారు. 16 డిస్పెన్సరీల్లో 12 డిస్పెన్సరీలను పూర్తిగా క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ముత్తుకూరు, చిత్తూరు జిల్లా వరదాయపాలెం డిస్పెన్సరీలను క్లోజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన పదింటికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు డిస్పెన్సరీలు కూడా దగ్గరలోని ఉన్న పాత డిస్పెన్సరీల నుంచి కొంతమందికి డైవర్షన్ కింద అక్కడ పోస్టింగ్‌లు ఇచ్చారు కానీ.. లేదంటే అవికూడా క్లోజ్ అయ్యేవి.
మాకేం సంబంధం లేదు..
ఇంత జరుగుతున్నా డైరెక్టరేట్ అధికారులు కనీసం స్పందించడం లేదు. కనీసం.. సిబ్బంది నియామకం చేపడతాం.. కొంత సమయం ఇవ్వడంటూ కార్పొరేషన్‌కు లేఖ కూడా రాసిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక డిస్పెన్సరీకి ఇద్దరు డాక్టర్లు, ఒక ఫార్మసిస్టు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు నర్సింగ్ సిబ్బంది, ఐదు మంది కార్యాలయ సిబ్బంది ఉంటే సరిపోతుంది. కేవలం 24 మంది డాక్టర్టు, 12 మంది ఫార్మసిస్టులు, 24 మంది స్టాఫ్‌నర్సులు, 24 మంది నర్సింగ్ సిబ్బందిని కూడా నియమించుకోలేని తీవ్రమైన దుస్థితిలో ఈఎ్‌సఐ డైరెక్టరేట్ అధికారులు ఉండడం సిగ్గుచేటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిచి డైరెక్టరేట్‌లో జరుగుతున్న అవినీతితోపాటు నిర్లక్ష్యమనే జబ్బుకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది.