అంగన్‌వాడీల విరమణ వయసు 62కు పెంచండి
ABN , First Publish Date - 2022-06-23T07:45:02+05:30 IST
అంగన్‌వాడీల విరమణ వయసు 62కు పెంచండి
గ్రాట్యుటీ అమలు చేయాలి: యూనియన్
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ బుధవారం అమరావతి సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని కోరారు. చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అంగన్వాడీలకు బీమా సౌకర్యం వర్తింపజేయాలని కోరారు. గ్రేడ్-2 సూపర్ వైజర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న వర్కర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.