రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ABN , First Publish Date - 2022-09-08T09:01:59+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

అనంతలో పొంగిపొర్లిన వాగులు, వంకలు

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లాలోని 28 మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా పంట, ఆస్తినష్టం జరిగింది. బొమ్మనహాళ్‌ మండలంలో ప్రవహిస్తున్న వేదవతి హగరి నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో భారీ వర్షానికి 28 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. పెనుకొండ మండలంలో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హిందూపురం ప్రాంతంలోని చెరువులు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఏకధాటిగా వాన దంచి కొట్టింది. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో రైతు కాటేపల్లి ప్రసాద్‌ తోటలో పిడుగుపాటుకు తొమ్మిది మేకలు మృతి చెందాయి. 


సముద్రంలో వేటకు వెళ్లొద్దు.. 

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకూ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన జాలర్లు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరారు.


శ్రీశైలం 4 గేట్లు ఎత్తి నీటి విడుదల..

శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,11,932 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,43, 935, సుంకేసుల నుంచి 1,55,511 మొత్తం 2,99,446  క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్ర స్తుతం 884.80 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.8450 టీఎంసీల నీరుంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఏపీ విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,872, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

Updated Date - 2022-09-08T09:01:59+05:30 IST