‘బటన్‌’ నొక్కితే చాలా?

ABN , First Publish Date - 2022-07-20T08:43:04+05:30 IST

‘‘బటన్‌ నొక్కడం నా బాధ్యత. నొక్కకపోతే నాదే తప్పు. అప్పుడు మీరు కూడా చేయగలిగేదేం లేదు. కానీ... బటన్‌ను నేను దేవుడి దయతో నొక్కగలుగుతున్నాను

‘బటన్‌’ నొక్కితే చాలా?

ఎవరి గ్రాఫ్‌ పడిపోతోంది?

వైసీపీ ఎమ్మెల్యేల విస్మయం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘బటన్‌ నొక్కడం నా బాధ్యత. నొక్కకపోతే నాదే తప్పు.  అప్పుడు మీరు కూడా చేయగలిగేదేం లేదు. కానీ... బటన్‌ను నేను దేవుడి దయతో నొక్కగలుగుతున్నాను. ఒక అనుకూల వాతావరణం క్రియేట్‌ అయ్యింది. దానిని మీరే ముందుకు తీసుకెళ్లాలి. అది నేను చేయలేను!’’... ఇది పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పిన మాట! ‘బటన్‌’ నొక్కడం మాత్రమే పాలన అన్నట్లు... రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచైనా సరే, ఆ పనితాను చేస్తున్నందున మిగిలిన బాధ్యత అంతా తమదే అన్నట్లు జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ‘మీరు ప్రజల్లోకి వెళ్లాలి. గ్రాఫ్‌ పెంచుకోవాలి. లేకుంటే టికెట్లు ఇవ్వను. ఇందులో మొహమాటంలేదు’ అంటూ జగన్‌ పదేపదే చేస్తున్న హెచ్చరికలు ఫలితం ఇవ్వకపోగా, ‘బూమెరాంగ్‌’ అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగితేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానంటూ ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఏర్పాటు చేసిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్‌ చెప్పారు. పార్టీ ప్లీనరీలో ఇదే చెప్పారు. ‘గడప గడపకూ’ వర్క్‌షా్‌పలలోనూ ఇదే చెబుతూ వస్తున్నారు. ‘ఏదైనా బాగుందంటే అది నా వల్ల, నేను బటన్‌ నొక్కడంవల్ల. బాగలేదంటే దానికి మీరే కారణం’ అనే జగన్‌ వైఖరితో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ‘‘ప్రభుత్వ అధికారుల్లో, కార్యకర్తల్లో, చివరికి వలంటీర్లలోనూ మేమంటే లెక్కలేనితనం కనిపిస్తోంది. దీనికి కారణం మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగనే’’ అని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 


ఫలించని హెచ్చరికలు... 

‘సర్వేల్లో సానుకూలత ఉన్న వారికే టికెట్‌. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. నాకోసం త్యాగం చేసిన వారికీ ఇదే వర్తిస్తుంది’ అని జగన్‌  హెచ్చరిస్తున్నారు. దీనిని మెజారిటీ ఎమ్మెల్యేలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పట్టించుకోవడంలేదు. ఈ కార్యక్రమంలో 50 మంది అసలే పాల్గొనలేదంటూ  సోమవారంనాటి వర్క్‌షాపులో జగన్‌ వారి పేర్లు చదివి వినిపించారు. వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకుండా పరధ్యానంలో, తమ పనుల్లో మునిగిపోయారని తెలిసింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వంలో కచ్చితంగా పాల్గొనాల్సిందే. మరో నెలరోజులు నేను స్వయంగా పర్యవేక్షిస్తాను’ అని సీఎం గర్జించగా... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకుండా వర్క్‌షాప్‌ ముగియగానే హైదరాబాద్‌కు చెక్కేశారు. ఇంకొందరు విజయవాడకు పరిమితమయ్యారు.


అభద్రతా భావంలో...

కనీసం 80 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవంటూ వైసీపీ అనుకూల మీడియా మార్చి 15న నిర్వహించిన వైసీపీఎల్పీ సమావేశం సమయంలోనే వెల్లడించింది. తమ వద్ద నిఘా వర్గాల సమాచారం ఉందని కూడా తెలిపింది. దీనిని వైసీపీ అధిష్ఠానం ఖండించలేదు. పైగా... ఆ తర్వాతి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ ఈ వార్తలను సమర్థించేలా మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో పలువురు  ఎమ్మెల్యేలలో తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ వస్తుందో రాదోనన్న సందేహం పెరిగిపోయింది. అయితే... బటన్‌ నొక్కినంత మాత్రాన సరిపోదని, పాలనలో భాగంగా ముఖ్యమంత్రి చేయాల్సింది చాలా  ఉందని ‘గడప గడపకూ’ కార్యక్రమంతో స్పష్టమైంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదంటూ నిలదీతలు, చెత్తపన్నుపై ఆగ్రహం, అధిక ధరలపై ఆక్రోశం, రహదారుల దుస్థితిపై నిరసనలతో ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ‘గడప’దాటేందుకు భయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడం లేదంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ప్రతిసారీ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు నిదీస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు సమాధానం వస్తోంది. తమకు ఇస్తామన్న రెండు కోట్ల నియోజకవర్గ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. సోమవారంనాటి గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులోనూ ఇదే పునరావృతమైంది. తమకు నిధులు ఇవ్వాలంటూ విజయవాడ, విశాఖ మహానగర పాలక సంస్థల పరిధిలోని ఎమ్మెల్యేలు కోరారు. నిధుల విషయం వచ్చే సరికి ముఖ్యమంత్రి సమాధానం దాటేయాల్సిన పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి నిధులపై ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో .. గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌ ముగుస్తూనే ..  నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల చొప్పున రూ.350 కోట్లను విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వు  జారీ చేసింది. వీటితో పాటు ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లినప్పుడు తక్షణమే అభివృద్ది పనులు చేసేందుకు కూడా గ్రామానికి, వార్డుకు ఇరవై లక్షల రూపాయల చొప్పున విడుదల చేస్తానని .. ఆ బాధ్యత తనదని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలపైకంటే .. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనపైనే ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అఽధినేత  పరిపాలనా తీరుపైనే ప్రజాభిప్రాయం కోరాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. కేవలం బటన్‌ నొక్కి నిధులు మళ్లించగానే లబ్ధిదారులందరూ వైసీపీ ఓటర్లుగా మారిపోతారని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నారని కొందరు అధికారపక్ష ఎమ్మెల్యేలు అంటున్నారు


అధినేత ఆదేశాలు బేఖాతరు 

గతంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశిస్తే దానిని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలూ తు.చ. తప్పకుండా పాటించేవారు. ఇప్పుడు సీన్‌ మారింది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీపీఎల్పీ కార్యాలయంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామని ముందే ప్రకటించారు. అయితే.. ఈ మాక్‌ పోలింగ్‌ను ఎమ్మెల్యేలు అంతగా పట్టించుకోలేదు. నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి ఓటు వేశారు. ఆ తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షా్‌పలో ‘నామ్‌కే వాస్తే’ పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నామని, ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్న ఆదేశాలనూ పెద్దగా పట్టించుకోలేదు.

Read more