-
-
Home » Andhra Pradesh » Pulivendula candidate BTech Rave-NGTS-AndhraPradesh
-
పులివెందుల అభ్యర్థి బీటెక్ రవే!
ABN , First Publish Date - 2022-02-23T08:46:55+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అక్కడ బరిలోకి దిగేది పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవేనని ప్రకటించారు.

- చంద్రబాబు స్పష్టీకరణ
- నియోజకవర్గ టీడీపీ నేతలతో భేటీ
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అక్కడ బరిలోకి దిగేది పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవేనని ప్రకటించారు. గత ఎన్నికల్లో జగన్‌పై ఇక్కడ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి.. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు. ఆయన మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంగళవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల నేతలతో సమావేశమయ్యారు. పార్టీని వీడివెళ్లిన వారు తిరిగి వచ్చినా.. అక్కడ పోటీచేసేది బీటెక్ రవి మాత్రమేనని ఆయన తేల్చేశారు. సతీశ్‌రెడ్డి వెళ్లాక నియోజకవర్గ బాధ్యతలను రవికే పార్టీ నాయకత్వం అప్పగించింది. ఆయన్నే ఇన్‌చార్జిగా ప్రకటించింది.
అంతటితో సరిపుచ్చకుండా నియోజకవర్గ నేతలతో నేరుగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచే నిమిత్తం చంద్రబాబు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వారితో పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు విడివిడిగా మాట్లాడి అక్కడ పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత వారితో చంద్రబాబు సమావేశమయ్యారు. మూడేళ్ల వైసీపీ పాలనతో పులివెందులలో కూడా ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారిందని, వైసీపీ కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోయిందని వారు చెప్పారు. ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలు నియోజకవర్గంలో వైసీపీ నాయకులను ఆత్మ రక్షణలో పడేశాయి. గతంలో రాజశేఖరరెడ్డి కుటుంబమంతా ఒకటిగా ఉండేది. ఈ హత్య తర్వాత రెండుగా చీలిపోయింది. కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని.. వారిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించిపోయింది. వైసీపీ ముఖ్య నాయకులు ఈ హత్య కేసులో జైళ్లకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్‌రెడ్డి ఇమేజ్‌ను, వైసీపీ ఇమేజ్‌ను ఈ పరిణామాలు బాగా దెబ్బ తీశాయి’ అని కొందరు నాయకులు చెప్పారు. మారిన పరిస్థితులను రాజకీయంగా మనకు అనువుగా మార్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు.