మద్య నిషేధం.. తూచ్‌!

ABN , First Publish Date - 2022-09-17T08:14:56+05:30 IST

మద్య నిషేధం.. తూచ్‌!

మద్య నిషేధం.. తూచ్‌!

అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన ప్రభుత్వం

నిషేధం ఎప్పుడని ప్రశ్నించిన ప్రతిపక్షం 

తాగుడు తగ్గిస్తామని సర్కారు జవాబు

తుస్సుమన్న సంపూర్ణ నిషేధం హామీ 

ఈ ఏడాది అమ్మకాల లక్ష్యం రూ.30 వేల కోట్లు 


అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మద్య నిషేధాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారని అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నించింది. ‘ప్రజల భౌతిక ప్రమాణాలను మెరుగుపరిచే దృష్టితో రాష్ట్రంలో ఆల్కహాల్‌ వినియోగ స్థాయులను తగ్గించాలనే స్పష్టమైన విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని సర్కారు సెలవిచ్చింది. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి ఏమైనా సంబంధం కనిపిస్తోందా? నిషేధం ఎప్పటిలోగా చేస్తారని అడిగితే ఫలానా నెల లేదా సంవత్సరం అని సమాధానం ఇవ్వాలి. అదికాకుండా కేవలం వినియోగాన్ని తగ్గిస్తామని మాత్రమే చెప్పింది. అంటే మద్య నిషేధం అనే మాటే లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చేసింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యులు మద్య నిషేధంపై అడిగిన ప్రశ్న టేబుల్‌ అయింది. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగి ఉంటే ఈ ప్రశ్న కూడా చర్చకు వచ్చేది. కానీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మొదటి మూడు ప్రశ్నలపైనే ఎక్కువసేపు చర్చించింది. సమయం లేదంటూ మిగిలిన ప్రశ్నలను ‘డీమ్డ్‌ టు బి ఆన్సర్‌’ కింద చేర్చారు. ఫలితంగా మద్య నిషేధం ప్రశ్నకు సమాధానం వచ్చినా చర్చ జరగలేదు. 


మద్యంతోనే ఎన్నికలు 

సంపూర్ణ మద్య నిషేధంపై ఇప్పటి వరకూ ప్రజలకు ఏ మూలనో ఉన్న చిన్న ఆశ కూడా ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాధానంతో పూర్తిగా అడుగంటిపోయింది. వినియోగం తగ్గించడమే లక్ష్యమని చెప్పడంతో నిషేధం ఉండదని స్పష్టమైంది. దీంతో మద్యం లేకుండా జరుగుతాయని భావించిన వచ్చే ఎన్నికల్లో మద్యం ఏరులై ప్రవహించనుంది. అటు ప్రభుత్వానికి, ఇటు బార్ల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించనుంది. గతేడాది ప్రభుత్వం మద్యం విక్రయాలపై రూ.21,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ.30వేల కోట్ల మద్యం అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో 4,380 షాపులు ఉన్నప్పుడు రోజుకు రూ.60కోట్ల విలువైన మద్యం అమ్మితే, ఇప్పుడు 2,934 షాపుల్లోనే రోజుకు రూ.80 కోట్ల వరకూ అమ్ముతున్నారు. తాజాగా 840 బార్లకు లైసెన్సులు జారీ చేశారు. మద్యం అమ్మకాలపై ప్రతి సోమవారం చీఫ్‌ సెక్రటరీ స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమ్మకాలు పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు అమ్మఒడి, చేయూత లాంటి పథకాలకు నగదు ఇచ్చే బాధ్యతను ఎక్సైజ్‌కు అప్పగించడంతో నిషేధం విధించలేని పరిస్థితి ఏర్పడింది. 


తొందరపడి హామీ? 

అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. అయితే సీపీఎస్‌ తరహాలోనే సరైన అవగాహన లేక ఈ హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. మద్యంపై వివిధ పన్నులు ఉంటాయి. అప్పట్లో నేరుగా ఎక్సైజ్‌కు వచ్చే ఆదాయం తక్కువగా, వ్యాట్‌ ద్వారా వచ్చేది చాలా ఎక్కువగా ఉండేది. జగన్‌కు ఎక్సైజ్‌ ఆదాయాన్ని మాత్రమే చూపించారని, అది తక్కువేననే ఆలోచనతో తొందరపడి ఆయన హామీ ఇచ్చారని అంటున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక తత్వం బోధపడి, హామీపై వెనక్కి తగ్గారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2022-09-17T08:14:56+05:30 IST