యుద్ధానికి సిద్ధం కండి
ABN , First Publish Date - 2022-09-03T08:51:08+05:30 IST
యుద్ధానికి సిద్ధం కండి
బద్దకం వదలాలి.. జనంలో తిరగాలి
ప్రతి నేతా దేనికైనా రెడీగా ఉండాలి
దుర్మార్గుడిని ఎదుర్కొంటేనే నిలబడతాం
ఇంకా ఒకటిన్నర సంవత్సరమే ఉంది
జగన్ పీడ పోవాలని జనం ఎదురుచూపులు
నేరస్థుల పాలన అంతమే మన లక్ష్యం
టీడీపీని చూస్తే జగన్ వెన్నులో వణుకు
పోలీసులను పక్కనపెట్టి వస్తే... వాళ్లేంటో.. మనమేంటో తేలిపోతుంది
వేధించే పోలీసులపై ప్రైవేటు కేసులు
జైళ్లకు వెళుతున్న నేతలకు అండ
వారికోసం ఎన్నికోట్లయినా వెచ్చిస్తాం
ఎన్టీఆర్‌తోనే సంక్షేమానికి తొలిబాట
విజన్ పోయి పాయిజన్ మిగిలింది
నియోజకవర్గస్థాయి నేతల సమావేశంలో
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్దేశం
రాష్ట్రంలో ఇంతకాలం జరిగిన రాజకీయం ఒక ఎత్తు.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం మరో ఎత్తు. దుర్మార్గుడిని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటేనే నిలబడగలుగుతాం. పార్టీని నిలబెట్టడం కోసం యోధుల్లా పోరాడుతున్న కార్యకర్తలు, నాయకులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. అందరం కలిసి రాష్ట్రంలో నేరస్థుల పాలనను అంతమొందిద్దాం - టీడీపీ అధినేత చంద్రబాబు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా, ఎప్పుడు ఈ పీడ విరగడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎగువ, మధ్యశ్రేణి నాయకులు బద్దకం వదలాలి. జనాల్లో తిరగాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి’’ అని దిశానిర్దేశం చేశారు. శుక్రవారం గుంటూరులోని టీడీపీ ప్రధాన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తాము హింసను ప్రోత్సహించడంలేదని, ముఠానాయకులను అణచివేసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ‘‘మనింటికివారే వచ్చి మనపైనే కేసు పెడతారు. మన పార్టీని చూస్తే జగన్‌కు వెన్నెముకలో భయం. పోలీసులను ఒక్కనిమిషం బయటపెట్టి వస్తే.. వాళ్లేంటో... టీడీపీ ఏంటో తేలిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. 26 క్లెమోర్‌మైన్స్ పెట్టినా భయపడలేదని, హైదరాబాద్‌లో మతవిద్వేషాలను అణిచివేసిన చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ అని స్పష్టంచేశారు. ‘‘మీరు ఇంట్లో పడుకుంటే మాత్రం ఎన్నికల్లో కూడా ఇంట్లోనే పడుకోవాల్సి వస్తుంది. మీరు పోరాడలేకపోతే పోరాడేవాళ్లకు అవకాశమివ్వండి. వైసీపీని, జగన్‌ను ప్రజాకోర్టులో దోషిగా నిలబడే వరకు పోరాడతాం. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్.. అనేది మన నినాదం కావాలి’’ అని కోరారు. కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించి, ముఖ్యనేతల పేర్లు చెప్పాలని వేధిస్తున్నారని, చివరకు తనపై కూడా కేసులు పెట్టారన్నారు. ‘‘ఇక ఒకటిన్నర సంవత్సరం ఉంది. సీఎంకు భయం పుడితే ముందుగా ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఈ సీఎం పీడ విరగడవుతుంది. ఈ రాష్ట్రానికి ఎప్పుడూ జరగని అన్యాయం జగన్ వల్ల జరిగింది’’ అని తెలిపారు.
పొత్తులపై మాట్లాడలేదు...
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంపైనే ప్రస్తుతం దృష్టినిలిపామని, పొత్తులపై తానెప్పుడూ మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. ‘‘జగన్ ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో ఎవరికైనా భవిష్యత్తు ఉంటుందా?.. మనమే కాదు, వైసీపీ నాయకులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఒకసారి విధ్వంసం ప్రారంభమైన తర్వాత ఎవరిపై ఎవరైనా దాడులు చేస్తారు. వ్యవస్థలు సరిగా ఉంటే అవి మనల్ని కాపాడతాయి. జగన్ పాలనలో చెక్స్ అండ్ బేలన్స్ లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు మీడియా రాసేది. ఇప్పుడు రాసిన వారిపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. అప్పుడే పునర్నిర్మాణం సాధ్యం. రాగద్వేషాలు లేకుండా పనిచేద్దాం. స్వాతంత్య్రం వచ్చి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ ఏట అడుగుపెట్టింది’’ అని తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోనున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను తొలిసారి బాధ్యతలు చేపట్టి 27 సంవత్సరాలు పూర్తి అయ్యాయని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ప్రజాజీవితాలను ప్రభావితం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ‘‘ఎన్టీఆర్ వచ్చి పార్టీ పెట్టేవరకు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు. ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధాలు లేని పరిస్థితి. అక్కడ ప్రయాణం మొదలుపెట్టి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించమే కాకుండా, పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే దశకు చేరుకున్నాం’’ అని వివరించారు. పాలకుడికి విజన్ ఉండాలేగానీ, విద్వేషం కాదన్నారు. కానీ, ఇప్పుడు విజన్ పోయి పాయిజన్‌గా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వెంటాడి, వేటాడి, పిచ్చివాణ్ని చేసి చంపేసే పరిస్థితికొచ్చారు. ఇప్పటికీ ఆ విద్వేషం ఆగే పరిస్థితి లేదు. నిన్ననే అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్లకార్డు పట్టుకోవడం ఆయన పాలిట శాపంగా మారింది. చివరకు ఎస్పీపైనా కేసు పెట్టాల్సి వచ్చింది. ఈ వార్తలు చూస్తే బాధేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
అన్న క్యాంటీన్లు ఆగవు...
ఎన్నిసార్లు దాడులు చేసినా అన్న క్యాంటీన్లు కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘‘గతంలో పలు పథకాలను అమలుచేశాం. ఇప్పుడు ఆవన్నీ రద్దు చేశారు. సీఎం జగన్ ఎలాంటి వ్యక్తి అంటే...చింతూరుకు వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లి ఓ పదేళ్ల అమ్మాయి నెత్తిన చేయి పెట్టి మాట్లాడారు. ఆ అమ్మాయి డెంగీ వచ్చి చనిపోయింది. వరదలు వచ్చిన తర్వాత పారిశుధ్యం, పౌష్ఠికాహార లోపం ఉంటాయి. ప్రత్యేకంగా ఫుడ్‌బాస్కెట్ ఇచ్చి అప్పట్లో కాపాడాం. ఈ రోజు ఆ అమ్మాయి బలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వ హత్యకాదా? సీఎంకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?.. సమాధానం చెప్పరు. ఎదురుదాడి చేస్తారు’’ అని మండిపడ్డారు. ‘‘దేశం అంతా రూ.75వేల తలసరి అప్పు ఉంటే రాష్ట్రంలో రూ.2.24 లక్షలు ఉంది. సేకరించిన ధాన్యానికి కూడా బకాయిలు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రైతులను తెచ్చారు. ఉచితంగా వచ్చే ఇసుక ట్రాక్టర్ రూ.5వేలు అయింది. భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింది. సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తే వారిని ఏ విధంగా అణచివేశారో చూశాం’’ అని ఆగ్రహించారు.
ఇక్కడి సోరెన్ మాటేమిటి?
తన పేరుమీద గనులు రాయించుకున్నారని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై కేసుపెట్టారని, ఏపీలో సరస్వతి పవర్‌ను జగన్ తనకు తాను ఇచ్చుకోలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘మద్యపాన నిషేధంచేసి ఓటు అడుగుతామన్నారు. ఇచ్చిన మాట తప్పి మద్యం తాకట్టుపెట్టి 25 ఏళ్ల కాలానికి 25 వేల కోట్లు అప్పు తెచ్చారు. పేదలపై దాడులు పెరిగాయి. ఆడబిడ్డలకు భద్రత లేదు. లేని దిశ చట్టాన్ని తెచ్చినట్లు నాటకం ఆడారు. ప్రజలకు జీవన ప్రమాణాలు సరిగాలేవు. ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నాయకుల ఆదాయాలు పెరిగిపోయాయి. జగన్ ఆదాయం రూ.2 లక్షల కోట్లు దాటాయి. రూ.25 వేల కోట్లు విలువైన 8500 ఎకరాల లేపాక్షి భూమిని జగన్ మేనమామకు చెందిన కంపెనీ కోట్ చేస్తోంది. అయినా, అడిగేవాళ్లు లేరు’’ అని ధ్వజమెత్తారు.
ఇక నియోజకవర్గాలపై నజర్..
ఈ నెల నుంచి నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు తెలిపారు. ‘‘నియోజకవర్గ ఇన్‌చార్జి నెలకు 20 రోజులు నియోజకవర్గంలో ఉండాలి. రెండు పార్లమెంట్‌లకు ఒక పరిశీలకుడు ఫీల్డ్‌లోనే ఉండాలి. ఈ నెల నుంచి ముగ్గురు సభ్యుల కమిటీ వేసి ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు తిరుగుతారు’’ అని వివరించారు. సంస్థాగత విషయాలు అందరం చర్చించుకోవాలని, కలిసి మాట్లాడుకుని ఆలోచనలను అందించాలని కోరారు.
పనిలోకి రావాల్సిందే..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ’’నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమర్థంగా పని చేయాలి. ఇన్‌చార్జి పదవి అలంకారప్రాయం అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. పార్టీలో గ్రూపులు ఉండటానికి వీల్లేదు. ఇన్‌చార్జిలే పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఎందుకంటే నేను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. అది మీ మనస్సుల్లో ఉండాలి. అలా కాకుండా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుని.. ఇంట్లో కూర్చుంటే కుదరదు. పార్టీ కోసం కష్టపడకుండా ఎన్నికల్లో సీట్లు కావాలంటే కుదరదు. అందరూ కలిసి సర్వశక్తులూ ఒడ్డి సమర్థవంతంగా పోరాడితే తప్ప ఈసారి ఎన్నికలను ఎదుర్కొనలేం. ఎప్పుడూ 60 నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో అతి సునాయాసంగా గెలిచే ప్రశాంతమైన నా నియోజకవర్గం (కుప్పం)లో కూడా గొడవలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. పార్టీ నాయకులు పట్టింపులు, ఇగోలు విడిచిపెట్టాలి. అలసత్వంగా ఉంటే ముందుకు పోలేం. రాష్ట్ర నాయకత్వంతోపాటు స్థానిక నాయకత్వం కూడా సమర్థంగా పనిచేస్తేనే పార్టీ కార్యకర్తలు, ప్రజలు ముందుకు వస్తారు. సంప్రదాయ రాజకీయాలు సరికాదు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వం కూడా చేయించడం లేదు. అలాంటివారికి పదవులు ఎందుకు? ఎక్కువ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నామమాత్రంగా మారాయి. ఈ పరిస్థితి మారాలి. పార్టీ బాధ్యతలను నిర్వర్తించకుండా కాడి పడేసే నాయకుల్ని మార్చడానికి వెనకాడం. ఈసారి ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని ఇప్పటికే చెప్పాం. నన్ను ఎవరూ అపార్థం చేసుకోవద్దు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రైవేటు కేసులు పెట్టండి...
చట్టాన్ని ఉల్లంఘిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘పోలీసుల అరాచకాలను ఓ సవాల్‌గా తీసుకుని న్యాయపరంగా, రాజకీయంగా పోరాడదాం. పోలీసుల వేధింపుల వల్ల జైలుకు వెళ్లిన పార్టీ నాయకులు, కార్యకర్తలను బయటకు తీసుకురావడానికి ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతాం. దీనికోసం మున్సిఫ్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళతాం’’ అని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తాను తప్పుబట్టడం లేదని, అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన కొందరు పోలీసులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అధికార పార్టీకి తొత్తులుగా మారి వేధించే పోలీసులపై జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, లోకాయుక్త వంటి సంస్థలకు ఫిర్యాదులు చేయాలి. అప్పటికీ వారు కంట్రోల్‌లోకి రాకపోతే అధికారంలోకి వచ్చాక.. వారిని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ విషయాన్ని అందరూ సీరియ్‌సగా తీసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘నా పేరు చెప్పకపోవచ్చు, టీడీపీ అధికారంలో లేకపోవచ్చు. అయినా మనం చేసిన పని శాశ్వతం. మనం ఆ రోజు వేసిన పునాదే నాలెడ్జి ఎకానమీలో తెలుగువారిని ముందు నిలిపింది. ఐటీ వల్లే ఈ రోజు భారతీయులు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారయ్యారు. అందులో 30 శాతం తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం. రాబోయే 20 సంవత్సరాల్లో అగ్రదేశాల్లో రెండోదిగా భారత్ రూపొందుతుంది’’
- టీడీపీ అధినేత చంద్రబాబు