పేదల గూడుపై కూల్చివేతల పిడుగు

ABN , First Publish Date - 2022-11-06T04:28:08+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. పాలక పెద్దల కనుసన్నల్లో గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు విధ్వంసం సృష్టించిన ఘటన జరిగి 24 గంటలైనా గడవక ముందే.. బాపట్లలో మున్సిపల్‌ అధికారులు దళితుల ఇళ్లు కూల్చివేశారు. ఏలూరు జిల్లా మాదేపల్లిలోనూ కబేళా అభివృద్ధి కోసమంటూ మూడు గుడిసెలు నేలమట్టం చేశారు.

పేదల గూడుపై కూల్చివేతల పిడుగు
POOR PEOPLE HOUSES DEMOLISH

బాపట్ల దళిత కాలనీలో గృహాలు కూల్చివేత

పసిబిడ్డలతో రోడ్డున పడిన కుటుంబాలు

ఎమ్మెల్యే కోన రఘుపతి వార్డులోనే దారుణం

ఏలూరులోనూ మూడు గుడిసెలు నేలమట్టం

బాపట్ల, ఏలూరు టూటౌన్‌, నవంబరు 5: వైసీపీ ప్రభుత్వంలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. పాలక పెద్దల కనుసన్నల్లో గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు విధ్వంసం సృష్టించిన ఘటన జరిగి 24 గంటలైనా గడవక ముందే.. బాపట్లలో మున్సిపల్‌ అధికారులు దళితుల ఇళ్లు కూల్చివేశారు. ఏలూరు జిల్లా మాదేపల్లిలోనూ కబేళా అభివృద్ధి కోసమంటూ మూడు గుడిసెలు నేలమట్టం చేశారు. బాపట్ల పట్టణంలోని 9వ వార్డు మూర్తి రక్షణ్‌నగర్‌ దళిత కాలనీలో 24 కుటుంబాలు జీబీసీ రోడ్డు పక్కనే దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నాయి. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఆ ఇళ్లను తొలగించాలని మున్సిపల్‌ అధికారులు ఇటీవల హుకుం జారీచేశారు. ఉన్నఫళంగా ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని బాధితులు మొరపెట్టుకోవడంతో కొంతకాలం శాంతించారు. అయితే.. శనివారం ఉన్నట్టుండి సిబ్బంది, జేసీబీతో వెళ్లిన అధికారులు గృహాలు మొత్తం కూల్చివేశారు. ఇళ్లలోని సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు. దీంతో పసిబిడ్డలతో రోడ్డున పడిన బాధితులు మేం ఎక్కడికి వెళ్లాలంటూ విలపించారు.

అధికారుల తీరు పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, పసిబిడ్డ తల్లి ఇంట్ల్లో ఉందని చెప్పినా అధికారులు కనికరించలేదని బాధిత మహిళ రమణ అన్నారు. ఇళ్లు కూల్చవద్దంటూ అడ్డువెళ్లిన వారిని కొట్టబోయారని తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతి చేయమంటేనే చేస్తున్నామని అధికారులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులమైన తమకు ఉండటానికి ఇల్లులేదని, అధికారులు స్థలం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, మున్సిపల్‌ అధికారులు కలిసి ఈ విధంగా చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యే నివాసం ఉండే వార్డులోనే ఇలా చేయడం దారుణమని, ఇదంతా కావాలనే చేశారని ఆరోపించారు.

బయటకు లాగి కూల్చేశారు..

ఏలూరు జిల్లా మాదేపల్లిలోని మేకల కబేళా దగ్గర వనకూరి మల్లమ్మ, వనకూరి వరలక్ష్మి, ఎస్‌.గీత కుటుంబాలు రేకుల షెడ్డులు వేసుకుని.. కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి. శనివారం ఉన్నట్టుండి మునిసిపల్‌ అధికారులు వచ్చి కబేళాను అభివృద్ధి చేయాలి. రెండు రోజులు సమయం ఇస్తున్నాం. వేరే ఇళ్లు చూసుకోవాలని చెప్పి వెళ్లారు. వారు అలా వెళ్లారో లేదో వెంటనే జేసీబీలు వచ్చాయి. అధికారులు ఇళ్లల్లో ఉన్న వారిని బయటకు లాగి ఆ గుడిసెలను కూల్చేశారు. బట్టలు, సామాన్లను కూడా తీసుకోనివ్వలేదు. దీంతో శనివారం ఉదయం నుంచి ఈ మూడు కుటుంబాలు నడిరోడ్డుపైనే ఉన్నాయి. ‘తిన్నా తినకపోయినా ఈ గుడిసెలోనే పడి ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ గూడు కూడా లేకుండా చేశారు. మేం ఎక్కడికి వెళ్లాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. నడిరోడ్డుపై ఉన్నాం. మమ్మల్ని బయటకు లాగేసి కూల్చేశారు’ అని బాధితురాలు వనకూరి మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లు కూల్చవద్దని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని వద్దకు పరుగెత్తుకుని వెళ్లినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు.

అది మేకల కబేళా స్థలం

అది మేకల కబేళా స్థలమని, దాన్ని ఆక్రమించుకుని ఇళ్లు వేసుకున్నారని అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శాంతిలత చెప్పారు.

Updated Date - 2022-11-06T04:28:09+05:30 IST