ఖాజీ భూములపై కుట్ర

ABN , First Publish Date - 2022-07-10T09:11:59+05:30 IST

డెబ్బై ఎకరాలు.. విలువ రూ. 140 కోట్లు పైమాటే! విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో ఈ భూములు ప్రస్తుతం నిషేధిత జాబితాలో (22ఏ) ఉన్నాయి. కేసు కోర్టులో ఉంది. ఇంతలోనే 22ఏ

ఖాజీ భూములపై కుట్ర

140 కోట్ల విలువైన  70 ఎకరాలపై రాజకీయ పైరవీ 

నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు ఎత్తులు

కోర్టు, వక్ఫ్‌ ట్రైబ్యునల్‌లో కేసు ఉండగానే బరితెగింపు

గతంలో ఖాజీ సర్వీసు పేరుతో పాస్‌బుక్‌ ఇచ్చిన రెవెన్యూ 

ఓ కుటుంబానికి వందేళ్ల లీజుకిచ్చిన అప్పటి ఖాజీ 

ఆ భూములు తనవేనంటూ మూడో వ్యక్తి ప్రవేశం

దొంగ లేఖ సంపాదించి.. ఓ వ్యక్తికి రిజిస్ర్టేషన్‌

సుప్రీందాకా వెళ్లిన వివాదం.. ట్రైబ్యునల్‌లో విచారణ

అయినా.. ఖాజీ సర్వీసు భూముల కబ్జాకు పావులు

కొందరితో ‘22ఏ మేళా’లో దరఖాస్తు.. రెవెన్యూపై ఒత్తిడి


(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

డెబ్బై ఎకరాలు.. విలువ రూ. 140 కోట్లు పైమాటే! విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో ఈ భూములు ప్రస్తుతం నిషేధిత జాబితాలో (22ఏ) ఉన్నాయి. కేసు కోర్టులో ఉంది. ఇంతలోనే 22ఏ నుంచి తప్పించి కోట్లు విలువ చేసే ఈ భూములను సొంతం చేసుకునేందుకు రాజకీయ పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో రెండువారాలుగా కొనసాగుతున్న 22 ఏ మెగా మేళా సందర్భంగా అప్లికేషన్‌ పెట్టించేందుకు కొందరు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం... 


 విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో రెవెన్యూ సర్వే నంబర్‌ 852 - 1 లో 70.46 ఎకరాల విస్తర్ణం కలిగిన భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇవి కొండపల్లి ఖాజీ సర్వీసు భూములు. వక్ఫ్‌ గజిట్‌లో అలాగే నమోదయ్యాయి. చాలా స్పష్టంగా నోటిఫైడ్‌ కూడా అయ్యాయి. గతంలో ఖాజీగా వ్యవహరించిన ముత్తావలి అనే వ్యక్తి ఈ భూములను యర్కారెడ్డి మల్లారెడ్డి కుటుంబీకులకు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన ఇచ్చారు. మల్లారెడ్డి నుంచి వారి సంతానం సీతామహలక్ష్మి, తదితర ఐదుగురు వారసుల చేతుల్లోకి ఈ భూములు మారాయి. ఆ తర్వాత ఈ భూములు అవులల్లా అనే వ్యక్తి పేరుతో అడంగల్‌కు ఎక్కాయి. ఆ తర్వాత అవులల్లా ఈ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. దీనికి సంబంధించిన రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కావలిలో జరిగింది. వక్ఫ్‌ బోర్డుతో సంబంధాలు కలిగిన అవులల్లా... ఇవి ఖాజీ సర్వీసు భూములు కావని, తానే సొంతదారునని నకిలీ లేఖను సంపాదించాడు. దానిని వాటిను చూపించి, రెవెన్యూ శాఖలోని కొందరి ఉద్యోగుల సహకారంతో అడంగల్‌లో కూడా పేరు మార్పించుకున్నాడు. ఆ తర్వాత వీటిని ఆధారంగా వేరే వ్యక్తికి కావలిలో రిజిస్ర్టేషన్‌ చేయించాడు.


2005-06కి ముందు ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాతికాలంలో దీనిపై ఫిర్యాదు అందుకున్న అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం... సీసీఎల్‌ఏకు, వక్ఫ్‌బోర్డుకు ఒక నివేదిక ఇచ్చింది. ఇవి ఖాజీ సర్వీసు భూములని నిర్ధారించి.. కావలిలో దీనిపై దొంగ రిజిస్ర్టేషన్‌ జరిగినట్టుగా తెలిపారు. ఆ తర్వాతి క్రమంలో అధికార యంత్రాంగాలు, ప్రతివాదులు పరస్పరం కోర్టులలో కేసులు వేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు కూడా చేరింది. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ దగ్గర తేల్చుకోవాల్సిందిగా నిర్ధేశించింది. తర్వాత క్రమంలో హైకోర్టుకు ప్రతివాదులు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు (ఇంటీరియమ్‌ ఆర్డర్‌) తెచ్చుకున్నారు. నిషేధిత భూములను రిజిస్ర్టేషన్‌ చేశారని, అప్పటి నున్న సబ్‌ రిజిస్ర్టార్‌తో పాటు, జిల్లా రిజిస్ర్టేషన్‌ అధికారికి కూడా జిల్లా యంత్రాంగం సమాచారం ఇచ్చింది. ఇది కావలి పరిధిలో జరిగింది కాబట్టి అక్కడికి జిల్లా రిజిస్ర్టేషన్‌  శాఖ అధికారులు పంపించారు. అప్పట్లో 4, 5 ల్యాండ్స్‌కు కలిపి రిజిస్ర్టేషన్లు చేయటం వల్ల వాటిని విభజన చేయటానికి ఎర్రర్‌ చూపిస్తోందని వారు సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్‌ఐసీ దృష్టికి జిల్లా యంత్రాంగం, వక్ఫ్‌బోర్డు అధికారులు వేర్వేరుగా తీసుకు వచ్చారు. ఎన్‌ఐసీ ద్వారా ఇప్పటికీ  ఆ సమస్య పరిష్కారం కాలేదు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌  శాఖ దగ్గర జరిగిన రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయటానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


ఈ క్రమంలో మళ్లీ ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టు వక్ఫ్‌బోర్డుకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌  శాఖ జరిగిన పొరపాటును ఆ తర్వాతైనా సరిచేసుకుని రద్దు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించి ఉండేది. ఇప్పటికి కూడా ఆ శాఖ నుంచి కనీస స్పందన లేదు. ఈ క్రమంలో వక్ఫ్‌బోర్డు ఈ భూములను మల్లారెడ్డికి వందేళ్లకు లీజుకు ఇచ్చిన ఖాజా కుటుంబీకులపైనా కేసు వేశారు. ఆ తర్వాత లీజుకు తీసుకున్న యర్కారెడ్డి మల్లారెడ్డి కుటుంబీకులపైనా కేసు నమోదు చేశారు. 


ఈ భూమి తనదేనంటూ వేరే వాళ్లకి అమ్మేసి రిజిస్ర్టేషన్‌ చేయించిన అవులల్లాపై విచారణ జరుపుతున్న క్రమంలో..వివాదాస్పద అంశాన్ని సెటిల్‌ చేసుకునేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. వీరి ప్రయత్నాలకు రాజకీయ పైరవీలు కూడా తోడు కావటంతో ... 22ఏ జాబితా నుంచి తొలగింపునకు అప్లికేషన్‌ పెట్టించేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-07-10T09:11:59+05:30 IST