political arena IAS: ఐఏఎస్‌లు సై

ABN , First Publish Date - 2022-12-12T04:34:15+05:30 IST

అధికార పీఠానికి అతి సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ, పార్టీ పనులను చక్కపెట్టడంలో తలమునకలైన కొందరు ఉన్నతాధికారులు రాజకీయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

political arena IAS: ఐఏఎస్‌లు సై

రాజకీయ బరిలో దిగేందుకు రెడీ!

ఇప్పటికే ఐదుగురు అఖిల భారత

అధికారులు పోటీకి సన్నద్ధం

పదవీ విరమణ చేసినవారూ అదే బాటలో..

అఽధికార వైసీపీ నుంచి పోటీకి సన్నాహాలు

కొందరికి ఇప్పటికే అందిన ఆశీస్సులు..

నియోజకవర్గాలను ఎంచుకుని పనిలోకి..

అందరూ ముఖ్యనేతకు సన్నిహితులే!

అధికార వైసీపీతో అంటకాగుతున్న అధికారుల్లో కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. కార్యనిర్వహణ రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. వీరిలో అఖిలభారత సర్వీసు అధికారుల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అధికార పీఠానికి అతి సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ, పార్టీ పనులను చక్కపెట్టడంలో తలమునకలైన కొందరు ఉన్నతాధికారులు రాజకీయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ నుంచే రాజకీయ రంగప్రవేశం చేయాలని వారు నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పదవీవిరమణ చేసి వివిధ పదవుల్లో కొనసాగుతున్న వారు కూడా ఎన్నికల సమయం నాటికి రాజకీయ కండువాలు కప్పుకోవాలనుకుంటున్నారట! రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులు వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ తరఫున బరిలోకి దిగనున్నట్లు అధికారవర్గాల ప్రైవేటు చర్చల్లో వినిపిస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ అధికారి ముఖ్యనేత వద్ద కీలక హోదాలో పనిచేస్తున్నారు. ప్రభుత్వసర్వీసులోకి రాకముందు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారు. 2024 మేలో రిటైర్‌ కాబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. వైసీపీలోనూ ఇదే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. ఇప్పటినుంచే గ్రామస్థాయిలో ఆయన సమన్వయం చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈయన ముఖ్యనేత సొంత వ్యవహారాలు చూస్తున్నారు. అధికారిగా ఆయనపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా సర్కారు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొంత మనిషి కావడంతో ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రిటైర్మెంట్‌ తర్వాత రాజకీయ తీర్ధం తనకు తప్పనిసరి అని ఆ అధికారి కూడా ప్రైవే టు చర్చల్లో చెబుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం మారి, తనపై వచ్చిన ఆరోపణల గుట్టు విప్పడానికి విచారణలు జరిపినా... తనను టార్గెట్‌ చేశారని చెప్పుకోవడానికి రాజకీయ వేదిక పనికొస్తుందని, ఇదే ప్రభుత్వం వస్తే తనకు మరింత ప్రాధాన్యత ఉంటుందని ఆ అధికారి చెబుతున్నట్లు తెలిసింది.

ఎటు ఉన్నా కుశలమే..

తమిళనాడుకు చెందిన ఓ ఏపీ కేడర్‌ అధికారి రాజకీయాలకు రెడీ అవుతున్నారు. ఈ ప్రభుత్వం, ఆ ప్రభు త్వం అన్న తేడాలేకుండా అత్యంత కీలకమైన శాఖల్లో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు అత్మీయంగానే ఉన్నారు. రాజధాని అమరావతి, సీఆర్‌డీఏ, ఇతర కీలక అంశాల్లో సర్కారు ఎన్నో విచారణలు, కమిటీలు వేసినా, ఆపై ఎన్నోన్నో కేసులు వేసినా ఏ ఒక్క దాంట్లోనూ ఆయన పేరు, ప్రస్తావనే లేదు. ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని సహచర అధికారులు చెబుతుంటారు. వచ్చే ఏడాది జూలైలో రిటైర్‌ కాబోతున్న ఈయన తిరుపతి నియోజకవర్గంపై దృష్టిపెట్టారని తెలిసింది.

ఖాకీ తీసి ఖద్దరు వేసి...!

పోలీసు శాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి రాజకీయప్రవేశంపై గట్టిగానే ప్లాన్‌చేసుకుంటున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని సమాచారం. ఆయనకు మరికొంత కాలం సర్వీసు ఉంది. ఇంకా ముఖ్యమైన పోస్టులు పొందే అవకాశం ఉంది. అయితే, రాజకీయ పరిస్థితులు మారితే తనకు ఇబ్బందులు ఉంటాయని, అందుకే ముందుగానే వీఆర్‌ఎస్‌ తీసుకొని వైసీపీ తీర్ధం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు అధికారుల ప్రైవేటు చర్చల్లో వినిపిస్తోంది. అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ఆలోచన ఉన్నట్లు ముఖ్యనేతకు తొలుత ఆయన తెలిపినట్లు తెలిసింది. అయితే అక్కడ వీలు కాకపోవడంతో చింతలపూడి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది.

వీఆర్‌ఎస్‌ తీసుకుని..!

ఏపీ కేడర్‌ కాని అధికారి ఒకరు ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టులో పనిచేస్తున్నారు. వరుస డిప్యుటేషన్‌లు పొడిగించుకుంటూ ఇక్కడే కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా సర్వీసు ఉన్నా ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే ఏపీలో కొనసాగించకపోవచ్చని, పైగా తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసే అవకాశం ఉందని ఆ అధికారి తన సహచరుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఎన్నికల వరకు ఇప్పుడున్న పోస్టులోనే కొనసాగాలనుకుంటున్నారు. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌కు ముందు వీఆర్‌ఎస్‌ తీసుకొని వైసీపీ తీర్ధం తీసుకోవాలని ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. వైసీపీ తరపున నంద్యాల ఎంపీగా పోటీచేయాలని ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంకో లడ్డూ కోసం...!

తాజాగా రిటైర్‌ అయిన అధికారికి ప్రభు త్వం ముందుగానే పోస్టింగ్‌ ఇచ్చింది. ఆది నుంచి ఆయన అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విమర్శ ఉంది. సర్వీసు ప్రారం భం నుంచే ముఖ్యనేత కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. పని లో కన్నా భజన చేయడం ద్వారానే ఆయన అధికార పీఠానికి దగ్గరయ్యారన్న విమర్శలున్నాయి. ఇటీవల ఓ సమావేశంలోనూ ఆయన ప్రభుత్వాధినేత ను సహచర అధికారుల సమక్షంలో విచక్షణ మరచి అభినవ రాజుగా, చక్రవర్తిగా కొనియాడారు. ఎవ్వరేమనుకుంటే తనకేమి అన్నట్లుగా తన భజన, సంకీర్తనలను వినిపించి తన లైను ఏమిటో చెప్పకనే చెప్పారు. దాని ఫలితమే అన్నట్లుగా, రిటైర్మెంట్‌కు ముందే, మరో పోస్టును దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి పశ్చిమ రాజకీయాల్లో రాణించాలని ఆశలు పెట్టుకున్నారు.

సార్లకు ఇది మామూలే..

అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులు, గ్రూప్‌-1 కేడర్‌లో ఉన్న వారు రాజకీయ ఆసక్తిని బట్టి ఎన్నికల సమరంలోకి దిగడం చాలాకాలం నుంచే చూస్తున్నాం. గతంలో అనేక మంది డిప్యూటీ కలెక్టర్లు, ఇతర గ్రూప్‌-1 అధికారులు సర్వీసులో ఉండగానే రాజకీయాలు చేసి.. ఎన్నికల్లో పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు పదవీ విరమణ చేసిన వెంటనే నచ్చిన రాజకయపార్టీలో చేరి టికెట్‌లు సాధించి ఎన్నికల బరిలో దిగారు. గత ప్రభుత్వం హయంలో ఐఏఎ్‌సగా పనిచేసిన రామాంజినేయులు రిటైర్‌ అయిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్న ఆదిమూలపు సురేశ్‌ వీఆర్‌ఎస్‌ తీసుకొని కాంగ్రెస్‌ తీర్థం పుచుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సీబీఐ అధికారిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వీఆర్‌ఎస్‌ తీసుకొని జనసేన తరపున పోటీచేశారు. ఐపీఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ పదవీవిరమణ తర్వాత వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన రత్నప్రభ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తిరుపతి ఉపఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీచే శారు.

Updated Date - 2022-12-12T04:34:16+05:30 IST