సొంత నేతల నోళ్లకూ తాళం

ABN , First Publish Date - 2022-12-15T03:24:47+05:30 IST

ఇప్పటి దాకా పోలీసులు అరెస్టులు, గృహ నిర్బంధాలతో విపక్ష నాయకులనే అడ్డుకుంటున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా నోళ్లు నొక్కుతున్నారు. ఇప్పుడు... వైసీపీలోని అసంతృప్త నేతల వంతు వచ్చింది.

సొంత నేతల  నోళ్లకూ తాళం

వైసీపీ అసమ్మతి నేతలకు పోలీస్‌ హెచ్చరికలు

ఠాణాకు పిలిపించి హెచ్చరించిన సీఐ

మంత్రి ముందు నోరు విప్పొద్దని హుకుం

పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వ్యతిరేకుల ఫైర్‌

నేడు మంత్రి సమక్షంలో వైసీపీ సమావేశం

మడకశిర, డిసెంబరు 14: ఇప్పటి దాకా పోలీసులు అరెస్టులు, గృహ నిర్బంధాలతో విపక్ష నాయకులనే అడ్డుకుంటున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా నోళ్లు నొక్కుతున్నారు. ఇప్పుడు... వైసీపీలోని అసంతృప్త నేతల వంతు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న నాయకులను స్థానిక సీఐ పోలీసు స్టేషన్‌కు పిలిపించి, మంత్రి ముందు నోరు విప్పవద్దని హెచ్చరించారు. వైసీపీ రాయలసీమ సమన్వయకర్త, సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం మడకశిరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి కారణంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న వైసీపీలోని ఒక వర్గం గట్టిగా గొంతెత్తేందుకు సిద్ధమవుతోంది. అయితే, అనూహ్యంగా ఈ వర్గం నేతలకు పోలీసుల నుంచి హెచ్చరికలు అందాయి. బుధవారం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, ‘మంత్రి వద్ద నోరు విప్పొద్దు’ అంటూ సీఐ సురేశ్‌ వారికి హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి స్టేషన్‌కు వెళ్లి సీఐని నిలదీశారు. తమవారిని విడిపించుకుని బయటకు వచ్చారు. ‘‘మడకశిర నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగింది. అధికారం చేపట్టి మూడున్నరేళ్లు అయినా సొంత పార్టీ వారికి న్యాయం చేయలేకపోయాం. కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడంలేదు. మడకశిరకు వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి ద్వారా తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటే, పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.

పెద్దిరెడ్డికి ఫోన్‌

మడకశిరలోని పరిస్థితులను మంత్రి పెద్దిరెడ్డికి బుధవారం ఫోన్‌ చేసి వివరించామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, రంగేగౌడ్‌, వాగేశ్‌ తెలిపారు. మంత్రి సూచనపై సీఐ సురేశ్‌పై అనంతపురం డీఐజీని కలిసి ఫిర్యాదు చేశామని మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొంత పార్టీవారినే ఆయన అణచివేస్తున్నారన్నారు. ‘జగన్‌ ముద్దు, తిప్పేస్వామి వద్దు’ అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆయన బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. రూ.10 లక్షలు ఇవ్వనందుకు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ అధికారిని ఎమ్మెల్యే సస్పెండ్‌ చేయించారని ఆరోపించారు. వైసీపీలోని 15 మంది నాయకులను ఎమ్మెల్యే టార్గెట్‌ చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-15T03:24:48+05:30 IST