పోలవరం కోసం సీఎం ఢిల్లీలో దీక్ష చేయాలి

ABN , First Publish Date - 2022-02-19T09:29:27+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజె క్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఢిల్లీ వచ్చి నిరాహారదీక్ష చేయాలి....

పోలవరం కోసం సీఎం ఢిల్లీలో దీక్ష చేయాలి

 ప్రాజెక్టు సాధించలేకుంటే 

 వైసీపీకి పుట్టగతులుండవు: రఘురామ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజె క్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఢిల్లీ వచ్చి నిరాహారదీక్ష చేయాలి. సీఎం ఏపీలో కూర్చుంటే సరిపోదు. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం సాధించలేకుంటే... మన పార్టీకి పుట్టగతులుండవు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ ప్రమాణస్వీకారం చేసే సమయానికే, గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తయ్యాయన్నారు. నాటినుంచి నేటి వరకూ వైసీపీ ప్రభుత్వం పోలవరానికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని ఆవ భూముల కుంభకోణంపై సమగ్ర  విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 15 లక్షల ఇళ్లు కడతామని ప్రగల్భాలు పలికి, లక్ష ఇళ్లు కట్టారని విమర్శించారు. జగనన్న ఇళ్లకు భారతీ సిమెంట్‌ పెనుభారమైందన్నారు. ఇల్లు కట్టాలంటే రూ.3లక్షలు అవుతుందని, ఇంత భారాన్ని ఎలా మోయగలమంటూ తన నియోజకవర్గం ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. కోర్టులు కూడా లేకపోతే రఘురామరాజును చంపేసేవారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజముందని అంగీకరిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో తన పేరు లేకపోవడంపై పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు రఘురామ చెప్పారు.

Read more