2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి: జగన్
ABN , First Publish Date - 2022-03-22T21:58:49+05:30 IST
2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం

అమరావతి: 2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నుండి డిజైన్లు వస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసేస్తామన్నారు. ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ ప్రారంభించారని, ఆయన కొడుగ్గా తానే పూర్తిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. సభ్యులు అడిగినట్టు పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం పెడతామని, ప్రాజెక్టును ఆయనకు డెడికేట్ చేస్తామని జగన్ ప్రకటించారు.
పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. పోలవరానికి చంద్రబాబు పనులే శాపంగా మారాయన్నారు. స్పిల్వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారని ఆరోపించారు. పోలవరం పూర్తవుతుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని, గతంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జోలికి చంద్రబాబు వెళ్లలేదని విమర్శించారు.
డిజైన్ ప్రకారం నదిని కుడివైపునకు మళ్లించాలని, అప్పర్, డౌన్ కాఫర్ డ్యాం నిర్మాణ పనుల్లో కొంత వదిలేశారని, దీనివల్ల చాలా నష్టం జరిగిందని జగన్ ఆరోపించారు. వరదల వల్ల 10-25 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని, వరద ఉధృతికి డయాఫ్రొం వాల్ బాగా దెబ్బతిన్నదని, దీన్ని సరిచేయడానికి రెండేళ్లుగా నిపుణులు ప్రయత్నిస్తున్నారని, ఇదేనా చంద్రబాబు విజయం? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్ కూడా తగ్గదని సీఎం జగన్ ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టైనా పోలవరం విషయంలో.. కేంద్రంతో ఇన్నిసార్లు మాట్లాడడానికి కారణం చంద్రబాబేనన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి.. ప్రాజెక్ట్ను తన చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. 2017 వరకూ పోలవరం పనులను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి చంద్రబాబుకు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. 2013-14 రేట్ల ప్రకారం చంద్రబాబు ఎలా ఒప్పుకున్నారని నిలదీశారు. పోలవరం చూపించడానికి వందకోట్లు ఖర్చు చేశారని, అందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.