Perni Nani: మిలటరీ చట్టం.. ఆర్మీ ప్రోటోకాల్‌పై పవన్‌కు కనీస అవగాహన లేదు

ABN , First Publish Date - 2022-12-10T02:43:39+05:30 IST

మిలటరీ చట్టం, ఆర్మీ ప్రోటోకాల్‌పై కనీస అవగాహన లేని వ్యక్తిగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై పార్టీ సామాజిక మాధ్యమం వేదికగా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.

Perni Nani: మిలటరీ చట్టం.. ఆర్మీ ప్రోటోకాల్‌పై  పవన్‌కు కనీస అవగాహన లేదు

‘వారాహి’పై సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ విమర్శలు

పసుపు రంగు వేసుకుంటే బెటర్‌: మాజీ మంత్రి పేర్ని ఎద్దేవా

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మిలటరీ చట్టం, ఆర్మీ ప్రోటోకాల్‌పై కనీస అవగాహన లేని వ్యక్తిగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై పార్టీ సామాజిక మాధ్యమం వేదికగా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పవన్‌ ఎన్నికల ప్రచారం కోసం ‘వారాహి’ వాహనాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే!. ఈ వాహనం ఆలివ్‌ గ్రీన్‌లో మిలటరీ వాహనాన్ని పోలి ఉండడంతో, రవాణా చట్టానికి లోబడి ఉందా? మిలటరీ యాక్టును ఉల్లంఘించడం కాదా? ఆర్మీ ప్రోటోకాల్‌ను ధిక్కరించడం కాదా? అని సామాజిక మాధ్యమాలు సందేహాలను వ్యక్తం చేస్తుండగా.. వీటినే వైసీపీ తన విమర్శనాస్త్రాలుగా మార్చేసుకుని జనసేనపై దుమ్మెత్తిపోస్తోంది. వారాహికి వేసిన రంగుపై రవాణాశాఖ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ‘మిలటరీ వినియోగించే ఆలివ్‌ గ్రీన్‌ను వేయకూడదని, ఇది నిషేధిత రంగు అని పవన్‌ కల్యాణ్‌కు తెలియదా?. సినిమాల్లో అయితే ఇలాంటి రంగులు వేసుకుని.. పెద్ద పెద్ద మిషన్‌ గన్లను పట్టుకుని బోర్డర్‌లో పాకిస్థాన్‌ జవాన్లపై కాల్పులు జరిపేయొచ్చు. వాస్తవంలో అది కుదరదు’ అని పేర్ని వ్యాఖ్యానించారు. మాటిమాటికీ తెలుపు రంగో మరొకటో మార్చుకోవడం కంటే ఏకంగా వారాహికి పసుపు రంగే వేసుకుంటే భవిష్యత్తులోనూ పవన్‌కు ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-12-10T02:43:41+05:30 IST